'రక్తానికి రక్తం'.. ట్రంప్ ఫ్యామిలీకి ఇరాన్ వార్నింగ్

by Muthe.Rajitha |

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేసింది.

రక్తానికి రక్తం.. ట్రంప్ ఫ్యామిలీకి ఇరాన్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్ : ఇరాన్, అమెరికా దేశాల మధ్య సైనిక ఉద్రిక్తతలు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేసింది. కన్నుకు కన్ను, రక్తానికి రక్తం అనే ప్రతీకార సిద్ధాంతాన్ని తాము అక్షరాలా నిజం చేసి చూపిస్తామని, డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ఆయన కుటుంబంలో ఎవ్వరినీ వదిలిపెట్టబోమని ఇరాన్ స్పష్టం చేసింది.

టెహ్రాన్ స్క్వేర్‌లో ‘రక్తానికి రక్తం’ బ్యానర్లు

ఇరాన్ కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, తమ ప్రతీకారేచ్ఛను ప్రపంచానికి చాటిచెప్పేలా వినూత్న ప్రదర్శనకు దిగింది. ఇరాన్ రాజధాని నగరం టెహ్రాన్‌లోని అత్యంత కీలకమైన 'పాలస్తీనా స్క్వేర్' (Palestine Square) లో భారీ బ్యానర్లను వేలాడదీసింది. ఆ బ్యానర్లపై 'రక్తానికి రక్తం' (Blood for Blood) అనే హెచ్చరిక వాక్యాలను పెద్ద అక్షరాలతో రాసి ప్రదర్శించింది. ఈ బ్యానర్‌లో డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులందరి చిత్రాలను ఉంచడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ట్రంప్ భార్య మెలానియా ట్రంప్, ఆయన కుమార్తెలు ఇవాంకా, టిఫాని, అలాగే కుమారులు డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్, బారన్ ట్రంప్‌ల శవపేటికలను (Coffins) అందులో ప్రదర్శించారు. ట్రంప్ కుటుంబంలోని ప్రతి ఒక్కరినీ అంతమొందిస్తామనే సంకేతాన్ని ఇచ్చేలా ఇరాన్ ఈ చర్యకు పాల్పడింది.

సుప్రీం లీడర్ హత్యకు ప్రతీకారం

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతికారంగానే తాము ఈ చర్యలు చేపట్టబోతున్నట్లు ఇరాన్ వర్గాలు వెల్లడించాయి. ఖమేనీ మరణానికి కారణమైన వారిని, దానికి ఆదేశాలు జారీ చేసిన ట్రంప్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారి జీవిత కాలంలోనే ఈ ప్రతీకారాన్ని తీర్చుకుంటామని ఇరాన్ గతంలోనూ పలుమార్లు శపథం చేసిన సంగతి తెలిసిందే. ఈ తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా రక్షణ సంస్థలు, సీక్రెట్ సర్వీస్ విభాగాలు అప్రమత్తమయ్యాయి. ట్రంప్, ఆయన కుటుంబ సభ్యుల భద్రతను మరింత కట్టుదిట్టం చేశాయి. ఇరాన్ చేసిన ఈ బహిరంగ హెచ్చరికలపై అమెరికా ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.

Next Story