- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలుగు రాష్ట్రాలకు బిగ్ రెయిన్ అలర్ట్.. రాబోయే ఐదు రోజులు భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. అల్పపీడన ప్రభావంతో రాబోయే ఐదు రోజులు ఏపీ, తెలంగాణలో ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు!

దిశ, వెబ్ డెస్క్: ఎల్ నినో ప్రభావంతో గత పది రోజులుగా వర్షాలు వెనకడుగు వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక సూచనలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలో రాబోయే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని, వర్షాల సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది.
కాగా ఈ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకారం.. ఆదివారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కడప జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఇతర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఇక సోమవారం విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాలలో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలు కురిసే సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల కింద నిలబడవద్దని, మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
తెలంగాణలో సైతం రాబోయే మూడు నుంచి ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిస్తే.. మరికొన్ని చోట్ల ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గత కొన్ని రోజులుగా తీవ్ర ఉక్కపోత, ఉష్ణోగ్రతలతో ఇబ్బంది పడుతున్న సామాన్య ప్రజలకు, వర్షాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న రైతన్నలకు ఈ వర్ష సూచన కాస్త ఊరటనిచ్చే విషయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.






