అటవీ–రెవెన్యూ సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి: మంత్రి పొంగులేటి

by Jakkula.Mamatha |

పాల్వంచ శ్రీనివాసగుట్ట అభివృద్ధి పై రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులతో ఒక సమగ్ర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

అటవీ–రెవెన్యూ సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి: మంత్రి పొంగులేటి
X

దిశ,​బూర్గంపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూముల రీ-సర్వే పనుల పురోగతి, అటవీ–రెవెన్యూ భూ సమస్యల పరిష్కారం, పోడు భూముల అంశం, పాల్వంచ శ్రీనివాసగుట్ట అభివృద్ధి పై రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులతో ఒక సమగ్ర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ​భూ రీ-సర్వే పనుల్లో జాప్యాన్ని ఉపేక్షించేది లేదన్నారు. జిల్లాలోని 70 గ్రామాల్లో చేపడుతున్న భూముల రీ-సర్వే పనుల పురోగతిని మంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు.

ప్రస్తుతం జిల్లాలో 14 గ్రామాల్లో రీ-సర్వే పనులు కొనసాగుతుండగా, వాటిలో ఐదు గ్రామాల్లో పనులు విజయవంతంగా పూర్తయ్యాయని అధికారులు వివరించారు. మిగిలిన అన్ని గ్రామాల్లో కూడా నిర్దేశిత గడువులోగా రీ-సర్వేను పూర్తి చేసేలా స్పష్టమైన కార్యాచరణను రూపొందించి అమలు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పాల్వంచలో పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడంపై మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆలస్యానికి గల కారణాలను తక్షణమే గుర్తించి, వాటిని అధిగమించాలని స్పష్టం చేశారు.

రెవెన్యూ–అటవీ–పోలీసు శాఖల సమన్వయం..

అటవీ–రెవెన్యూ భూ సమస్యల పరిష్కారంపై మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు.జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలను పోలీసు శాఖ ద్వారా ముందస్తుగా గుర్తించాలని, ఆయా ప్రాంతాల్లో నెలకొన్న భూ వివాదాలను సామరస్యపూర్వకంగా, చట్టబద్ధంగా పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలని ఆదేశించారు. సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ, అటవీ, పోలీస్ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి, దీర్ఘకాలిక భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. జిల్లాలో కొత్తగా ఎలాంటి పోడు సాగు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.అదే సమయంలో, గతంలో పోడు సాగు చేసుకుంటున్న అణగారిన వర్గాల సమస్యలను ప్రభుత్వ నిబంధనలకు లోబడి, మానవీయ కోణంలో పరిశీలించి వారికి శాశ్వత న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

శ్రీనివాసగుట్టను ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి..

పాల్వంచలోని ప్రసిద్ధ శ్రీనివాస గుట్టపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు సులభంగా, సురక్షితంగా చేరుకునేలా ఘాట్ రోడ్డు, రహదారి నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలను తక్షణమే సిద్ధం చేయాలని సంబంధిత శాఖల అధికారులను మంత్రి ఆదేశించారు. శ్రీనివాస గుట్టను ఒక ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికను రూపొందించి, అవసరమైన మౌలిక వసతులను కల్పించాలన్నారు. ​ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, జిల్లాలో దశల వారీగా రీ-సర్వే పనులు పారదర్శకంగా కొనసాగుతున్నాయని వివరించారు.

మిగిలిన గ్రామాల్లో సైతం నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నామని, రెవెన్యూ, అటవీ, పోలీసు శాఖల సమన్వయంతో ప్రజలకు ఇబ్బంది లేకుండా భూసమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.​ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జిల్లా రెవెన్యూ అధికారి పద్మావతి, కొత్తగూడెం ఆర్డీవో మధు, డివిజనల్ అటవీ అధికారులు, రెవెన్యూ, అటవీ, పోలీసు శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story