Accenture: యాక్సెంచర్ కొత్త పే మోడల్

by S Gopi |

ఈసారి జూన్ వేతన సవరణలో అర్హులైన ఉద్యోగులకు ఇచ్చే మొత్తం పెంపును రెండు సమాన భాగాలుగా విభజించాలని కంపెనీ నిర్ణయించింది.

Accenture: యాక్సెంచర్ కొత్త పే మోడల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో వ్యయ నియంత్రణను కొనసాగిస్తూనే, ఎక్కువ మంది ఉద్యోగులకు వేతన పెంపు అందించేందుకు ప్రముఖ ఐటీ దిగ్గజం యాక్సెంచర్ కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. ఈసారి జూన్ వేతన సవరణలో అర్హులైన ఉద్యోగులకు ఇచ్చే మొత్తం పెంపును రెండు సమాన భాగాలుగా విభజించాలని కంపెనీ నిర్ణయించింది. అంటే, పెంపులో సగం మూల వేతనంలో (బేస్ పే) కలపగా, మిగిలిన సగాన్ని జూన్‌లో ఒకేసారి ఇచ్చే నగదు చెల్లింపుగా అందిస్తుంది. ఉదాహరణకు, ఒక ఉద్యోగికి 3 శాతం పెంపు నిర్ణయిస్తే, అందులో 1.5 శాతం బేస్ పేలో చేరగా, మరో 1.5 శాతం లంప్‌సమ్‌గా చెల్లిస్తారు. దీంతో ఉద్యోగులకు వెంటనే అదనపు నగదు లభించడంతో పాటు, కంపెనీ పేరోల్‌పై దీర్ఘకాలిక భారం కూడా తగ్గుతుంది. గత ఏడాది పరిమిత స్థాయిలో మాత్రమే జీతాల పెంపు ఇచ్చిన యాక్సెంచర్, ఈసారి ఎక్కువ మంది ఉద్యోగులను కవర్ చేయడమే లక్ష్యంగా ఈ విధానాన్ని తీసుకొచ్చింది. అయితే పదోన్నతి పొందిన ఉద్యోగులకు ఈ 50:50 విధానం వర్తించదు. వారికి మొత్తం పెంపు పూర్తిగా మూల వేతనంలోనే కలుస్తుంది. అలాగే ఈ లంప్‌సమ్ చెల్లింపు డిసెంబర్‌లో ఇచ్చే వార్షిక బోనస్‌కు ప్రత్యామ్నాయం కాదని కంపెనీ స్పష్టం చేసింది. బేస్ పే పెంపు, లంప్‌సమ్ చెల్లింపు రెండూ కూడా ఉద్యోగి వార్షిక ఆదాయంలో భాగంగా పరిగణిస్తామని, ఉద్యోగి షేర్ కొనుగోలు పథకాల్లో ఉన్నవారికి ఈ చెల్లింపుపై సాధారణ కోతలు కూడా వర్తిస్తాయని కంపెనీ వెల్లడించింది.

Next Story