'నాలుగు ఎకరాలిచ్చినా.. నాలుగు మెతుకులు పెడ్తలేరు'.. ప్రజావాణిలో వృద్ధురాలి ఆవేదన

by Jakkula.Mamatha |

సార్.. మాకు బుక్కెడు బువ్వ పెట్టించండి.

నాలుగు ఎకరాలిచ్చినా.. నాలుగు మెతుకులు పెడ్తలేరు.. ప్రజావాణిలో వృద్ధురాలి ఆవేదన
X

దిశ, జగిత్యాల కలెక్టరేట్: సార్.. మాకు బుక్కెడు బువ్వ పెట్టించండి. ముగ్గురు కొడుకులు ఉన్నా మా కడుపుకింత తిండి పెట్టడం లేదు" అంటూ వెల్గటూర్ మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు గాజుల లచ్చమ్మ ప్రజావాణి కార్యక్రమంలో అధికారుల ఎదుట కన్నీరుమున్నీరైంది. తన భర్త గాజుల రాజంకు 76 సంవత్సరాలు అని తనకు 70 ఏళ్ల వయసు అని వృద్ధాప్యంతో బాధపడుతున్నట్లు తెలిపింది. తమకు ముగ్గురు కొడుకులు ఉన్నారని, జీవితాంతం కష్టపడి సంపాదించిన నాలుగు ఎకరాల భూమిని వారికి ఇచ్చామని, కానీ ఇప్పుడు వృద్ధాప్యంలో కనీసం తిండి కూడా పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

ఆరోగ్యం బాగున్న రోజుల్లో కూలి పనులకు వెళ్లి వచ్చిన దాంతో కడుపు నింపుకుంటున్నాం. పని చేయలేని రోజుల్లో ఉపవాసమే మా పరిస్థితి అంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. తాము సంపాదించిన భూమిని కౌలుకు ఇచ్చి జీవనం సాగిద్దామని ప్రయత్నించినా, కౌలుకు తీసుకోవడానికి ముందుకు వచ్చిన వారిని కూడా తమ కొడుకులే అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించింది. కాటికి కాళ్లు చాపిన ఈ వయసులో కొడుకులతో గొడవలు వద్దని బతికినన్ని రోజులు కనీసం బుక్కెడు తిండి పెట్టేలా అధికారులే చొరవ తీసుకోవాలి అంటూ అధికారులను వేడుకుంది. ఫిర్యాదుపై స్పందించిన అధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Next Story