బీజేపీలో ముదిరిన వర్గ పోరు

by velandi.Saikiran |   (  Updated:2026-07-20 23:30:36  IST  )

రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, తార్నాక డివిజన్ భారతీయ జనతా పార్టీలో తీవ్ర కలకలం రేగుతున్నది.

బీజేపీలో ముదిరిన వర్గ పోరు
X

దిశ, సికింద్రాబాద్: రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, తార్నాక డివిజన్ భారతీయ జనతా పార్టీలో తీవ్ర కలకలం రేగుతున్నది. నిన్నటివరకు లోపాయకారీగా ఉన్న అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రోడ్డుకెక్కాయి. సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజాదరణ పొందుతూ ఇటీవల పార్టీలో చేరిన యువ నేత శ్రీరామ్ వెంకటేశ్, స్థానిక పాత తరం నాయకుల మధ్య మొదలైన ఈ 'వర్గ పోరు' ఇప్పుడు డివిజన్ పరిధి దాటి రాష్ట్ర స్థాయి రచ్చగా మారింది. దాడులు, పోలీసు ఫిర్యాదులు, అర్ధరాత్రి ఫ్లెక్సీల తొలగింపులతో తార్నాక రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

శ్రీరామ్ వెంకటేశ్ దూకుడు.. పాత తరం అసంతృప్తి!

సామాజిక సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటూ స్థానికంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్ వెంకటేశ్ ఇటీవల అధికారికంగా బీజేపీ కండువా కప్పుకున్నారు. కాలనీ సంక్షేమ సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికై పలు కాలనీల సమస్యలను వేగంగా పరిష్కరిస్తూ వార్తల్లో నిలిచారు. దీంతో స్థానిక పాత వర్గం నాయకులు దీనిని జీర్ణించుకోలేకపోతున్నారు. చివరికి ఇది అంతర్గత యుద్ధానికి తెరలేపింది.

కారు ధ్వంసం.. రాత్రికి రాత్రే ఫ్లెక్సీల పీకివేత!

ఈ వర్గ పోరు ఎంతవరకు వెళ్లిందంటే.. ఇటీవల శ్రీరామ్ వెంకటేశ్‌ను లక్ష్యంగా చేసుకొని గుర్తు తెలియని దుండగులు ఆయన కారును ధ్వంసం చేశారు. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ ఘర్షణ వాతావరణం ఇలా ఉండగానే.. తాజాగా శ్రీరామ్ వెంకటేశ్ ఉచిత సేవలో భాగంగా తార్నాకలో ఒక భారీ మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు, జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్‌కు స్వాగతం పలుకుతూ డివిజన్‌లోని పలు ప్రధాన కూడళ్లలో శ్రీరామ్ వెంకటేశ్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఓర్వలేకపోయిన ప్రత్యర్థి వర్గానికి చెందిన ఓ బీజేపీ నాయకుడు.. రాత్రికి రాత్రే మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసి వాటన్నింటినీ పీకించేశారు.

అగ్రనేతల సొంత డివిజన్‌లోనే..?

ఈ అంతర్గత పోరు ఇప్పుడు బీజేపీ హైకమాండ్‌కు తలనొప్పిగా మారింది. తార్నాక డివిజన్ సాధారణమైనది కాదు.. స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తీక చంద్రారెడ్డి వంటి అగ్రనేతలు నివసిస్తున్న, ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్ ఇది. ఒక రాష్ట్ర అధ్యక్షుడిని ఆహ్వానిస్తూ వేసిన ఫ్లెక్సీలను, అదే పార్టీకి చెందిన మరో వర్గం నేత మున్సిపల్ అధికారులతో తీయించడం పార్టీ శ్రేణులను విస్మయానికి గురిచేస్తోంది.

శుభం కార్డు పలుకుతారా..?

ముందున్నవి అత్యంత ప్రతిష్టాత్మకమైన జీహెచ్‌ఎంసీ ఎన్నికలు కావడంతో, తార్నాకలో జరుగుతున్న ఈ పరిణామాలు పార్టీ భవిష్యత్తును శాసించేలా ఉన్నాయి. ఇప్పుడు అందరి కళ్లూ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావుపైనే ఉన్నాయి. తన సొంత డివిజన్ లోని ఈ తీవ్ర వర్గ పోరులో ఆయన నేరుగా జోక్యం చేసుకొని గ్రూపు రాజకీయాలకు 'శుభం కార్డ్' పలుకుతారా? లేక దీనిని ఇలాగే వదిలేస్తారా? అన్న చర్చ సాగుతున్నది.

Next Story