సిక్కిం టన్నెల్ ప్రమాదంలో 10 కి చేరిన మృతుల సంఖ్య.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కేంద్రం

by Malleboina Mahesh |

సిక్కింలోని నామ్చి జిల్లా సమర్డుంగ్ పరిధిలో నిర్మాణంలో ఉన్న జలవిద్యుత్ ప్రాజెక్ట్ సొరంగం కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో మృతుల సంఖ్య 10 కి చేరుకుంది.

సిక్కిం టన్నెల్ ప్రమాదంలో 10 కి చేరిన మృతుల సంఖ్య.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కేంద్రం
X

దిశ, వెబ్ డెస్క్: నిర్మాణంలో ఉన్న జల విద్యుత్ ప్రాజెక్ట్ సొరంగం కొండచరియలు విరిగిపడి కూలిపోయిన విషాద సంఘటన సిక్కింలోని నామ్చి జిల్లా సమర్డుంగ్ పరిధిలో చోటు చేసుకుంది. ఉదయం నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుండగా.. మృతుల సంఖ్య 10 కి చేరుకుంది. నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (NHPC) ఆధ్వర్యంలో చేపడుతున్న తీస్తా స్టేజ్-VI జల విద్యుత్ ప్రాజెక్టులోని 'ADIT-3' టన్నెల్ హఠాత్తుగా కుప్పకూలడంతో ఈ ప్రమాదం జరిగింది. సోమవారం ప్రమాదం జరిగిన సమయంలో ప్రాజెక్ట్ అధికారులు, కార్మికులు సహా మొత్తం 25 మంది సొరంగం లోపల చిక్కుకుపోయినట్లు అధికారులు వెల్లడించారు.

ఘటనా స్థలంలో ఎన్డీఆర్‌ఎఫ్, పోలీస్, రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. ఇప్పటివరకు 10 మృతదేహాలను వెలికి తీసినట్లు నామ్చి జిల్లా అధికారులు ధ్రువీకరించారు. సొరంగంలో ఇంకా మిగిలిన వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతుండటంతో, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ విషాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ సహా ఇతర కేంద్ర మంత్రులు స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు తన తీవ్ర సంతాపాన్ని ప్రకటించి, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఎక్స్‌గ్రేషియా ప్రకటన

ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందిస్తామని ప్రధాని కార్యాలయం (PMO) 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా వెల్లడించింది. అలాగే తీవ్రంగా గాయపడిన బాధితులకు రూ. 50,000 చొప్పున సహాయం అందించనున్నట్లు స్పష్టం చేశారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్‌తో ఫోన్‌లో మాట్లాడి సహాయక చర్యల గురించి ఆరా తీశారు. టన్నెల్‌లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF) బృందాల ద్వారా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని అమిత్ షా హామీ ఇచ్చారు.

Next Story