పోక్సో కేసులో నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష..

by Kodari Anjali |

మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి సిరిసిల్ల పోక్సో ప్రత్యేక కోర్టు 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధించింది.

పోక్సో కేసులో నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష..
X

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి సిరిసిల్ల పోక్సో ప్రత్యేక కోర్టు 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధించింది. ఈ మేరకు పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధిక జైస్వాల్ మంగళవారం తీర్పు వెలువరించినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని బి.వై. నగర్‌కు చెందిన వేముల శ్రీనివాస్ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు చైల్డ్ హెల్ప్‌లైన్–1098కు ఫిర్యాదు అందింది. జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఫిర్యాదు మేరకు సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అప్పటి దర్యాప్తు అధికారి శ్రీకాంత్ విచారణ పూర్తి చేసి నిందితుడిని అరెస్ట్ చేసి చార్జ్‌షీట్ దాఖలు చేశారు. కోర్టు విచారణలో ఎనిమిది మంది సాక్షులను ప్రవేశపెట్టగా, ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ రజినీకాంత్ వాదనలు వినిపించారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు నిందితుడిపై అభియోగాలు రుజువయ్యాయని నిర్ధారించి 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధించింది. ఈ కేసులో సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అప్పటి విచారణ అధికారి శ్రీకాంత్, ప్రస్తుత సీఐ శ్రీనివాస్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రజినీకాంత్, కోర్టు మానిటరింగ్ ఎస్‌ఐ రవీందర్ నాయుడు, కోర్టు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. మైనర్లపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని, ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుబడి ఉందని ఎస్పీ పేర్కొన్నారు.

Next Story