- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ నిరసనలు రాజకీయ నాటకాలే: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్
ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వద్ద కాంగ్రెస్ ధర్నా చేేపట్టడంపై కేంద్ర మంత్రి కిషన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధానమంత్రి నివాసం ఎదుట కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ధర్నాపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న సమయంలో ప్రతిపక్షం సభలో చర్చలు జరపడం, ప్రశ్నలు అడగడం, దేశ నిర్మాణానికి నిర్మాణాత్మకంగా సహకరించడం ప్రజాప్రతినిధుల ప్రాథమిక బాధ్యత అని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం పార్లమెంట్‌లో అంతరాయాలు సృష్టిస్తూ, బయట రాజకీయ నాటకాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రతి పార్లమెంట్ సభ్యునికి మాట్లాడే, చర్చించే హక్కును రాజ్యాంగం కల్పించిందని, అంతమాత్రాన పార్లమెంట్ కార్యకలాపాలను పదేపదే అడ్డుకునే హక్కు లేదని మంత్రి స్పష్టం చేశారు. సభ స్తంభించడం వల్ల దేశానికి, ప్రజాస్వామ్య విలువలకు తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. చర్చలను అడ్డుకోవడం, సభను వాయిదా పడేలా చేయడం, అనంతరం ‘ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ’ ప్రదర్శనలు చేయడం కాంగ్రెస్‌కు పరిపాటిగా మారిందని విమర్శించారు. ఇది సరైన ప్రతిపక్ష ధోరణి కాదని, తాము రక్షిస్తున్నామని చెప్పుకునే ప్రజాస్వామ్య వ్యవస్థనే బలహీనపరిచే ప్రయత్నమని కిషన్ రెడ్డి ఆరోపించారు.
ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీవిధించి ప్రజాస్వామ్య హక్కులను అణచివేసిన పార్టీనే ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదమని కిషన్ రెడ్డి కామెంట్ చేశారు. వరుస ఎన్నికల్లో, ఒకదాని తర్వాత మరొక రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరిస్తూనే ఉన్నారని గుర్తుచేశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, అసోం, పుదుచ్చేరి తదితర రాష్ట్రాల్లో ప్రజలు తమ తీర్పును స్పష్టంగా వెల్లడించారని పేర్కొన్నారు. ప్రజాసేవ కంటే రాజకీయ అవకాశవాదానికే కాంగ్రెస్ ప్రాధాన్యం ఇస్తోందని ప్రజలు గ్రహించారని వ్యాఖ్యానించారు. ధర్నా సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ప్రతీకాత్మకంగా సంకెళ్లు ధరించి నిరసన తెలపడం వ్యంగ్యాస్పదంగా ఉందని మంత్రి అన్నారు. కాంగ్రెస్ అసలు ఉద్దేశాలను ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారని, ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఆ పార్టీ రాజకీయ ఆశయాలకు ప్రజలు ఎప్పుడో అడ్డుకట్ట వేశారని కిషన్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ వద్ద నిజంగా వాస్తవాలు, ఆధారాలు ఉంటే వాటిని పార్లమెంట్‌లోనే ప్రస్తావించాలని మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ఇందుకు అవసరమైన అన్ని రాజ్యాంగబద్ధమైన, పార్లమెంటరీ విధానాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అయితే అందుకు సన్నద్ధత, నమ్మకం, తమ వాదనలపై విశ్వాసం అవసరమని, కేవలం రాజకీయ నాటకాలతో అవి సాధ్యం కావు అని పేర్కొన్నారు. దేశానికి నిరంతరం ఆందోళనలు, అంతరాయాల రాజకీయాలు చేసే ప్రతిపక్షం కాకుండా... చర్చలు, జవాబుదారీతనం, నిర్మాణాత్మక సహకారం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే బాధ్యతాయుతమైన ప్రతిపక్షం అవసరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హితవు పలికారు.






