- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ అగ్రనేతలు అరెస్ట్.. అర్థరాత్రి భారీ నిరసనకు దిగిన జగ్గారెడ్డి
ఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీయడం, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ప్రియాంకా గాంధీలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ వేడిని రగిల్చింది.

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీయడం, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ప్రియాంకా గాంధీలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ వేడిని రగిల్చింది. ఈ వార్త తెలియగానే తెలంగాణలోని పలు జిల్లాల్లో కాంగ్రెస్ శ్రేణులు రోడ్లపైకి వచ్చి తీవ్ర నిరసనలు తెలిపాయి. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. రాహుల్ గాంధీ అక్రమ అరెస్టును ఖండిస్తూ సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద 65వ నంబరు జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు.
కేంద్ర ప్రభుత్వానికి, పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో పోతిరెడ్డిపల్లి జంక్షన్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరసనను అడ్డుకోవడానికి యత్నించిన పోలీసు వాహనాలను కార్యకర్తలు చుట్టుముట్టి అడ్డుకోవడంతో కొద్దిసేపు పరిస్థితులు చేతులు దాటేలా కనిపించాయి. జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అదనపు బలగాలను రప్పించి పరిస్థితిని సమీక్షించారు. విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం మోడీ ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనమని జగ్గారెడ్డి ఈ సందర్భంగా మండిపడ్డారు.






