ఒడిస్సీ.. "గూగుల్ మ్యాప్స్ వల్లే పదేళ్లు పట్టింది" : నెట్టింట్లో వీడియో వైరల్

by Muthe.Rajitha |

హాలీవుడ్ లెజెండరీ దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన విజువల్ వండర్ ‘ది ఒడిస్సీ’ (The Odyssey) ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.

ఒడిస్సీ.. గూగుల్ మ్యాప్స్ వల్లే పదేళ్లు పట్టింది : నెట్టింట్లో వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్ : హాలీవుడ్ లెజెండరీ దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన విజువల్ వండర్ ‘ది ఒడిస్సీ’ (The Odyssey) ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. విడుదలైన మొదటి వీకెండ్‌లోనే ప్రపంచవ్యాప్తంగా అక్షరాలా రూ.2,000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డులను నమోదు చేసిన ఈ చిత్రం, వీక్‌డేస్‌లోనూ అదే స్థాయి కలెక్షన్ల జోరును కొనసాగిస్తోంది. నోలన్ మార్క్ అత్యద్భుత టేకింగ్, బిగ్ స్క్రీన్ పై కళ్లు చెదిరేలా రూపుదిద్దుకున్న విజువల్స్, థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లేకి ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. భారతీయ బాక్సాఫీస్ వద్ద కూడా ఈ మూవీ తన హవాను స్పష్టంగా చాటుకుంటోంది.

పదేళ్ల ఆలస్యానికి కారణం అదే!

ఒకవైపు థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురుస్తుంటే, మరోవైపు ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో నెటిజన్లు సృష్టిస్తున్న వినోదాత్మక కంటెంట్ విపరీతంగా వైరల్ అవుతోంది. గ్రీకు పురాణ కథ ప్రకారం ట్రోజన్ యుద్ధం ముగిసిన తర్వాత ఒడిస్సియస్ తన సైన్యంతో కలిసి స్వదేశమైన 'ఇథాకా'కు ప్రయాణమవుతాడు. నిజానికి కేవలం పది రోజుల్లో ముగియాల్సిన ఆ సముద్ర ప్రయాణం అనేక అనుకోని పరిస్థితుల వల్ల ఏకంగా పదేళ్ల సమయం పడుతుంది. అయితే, ఈ పదేళ్ల ఆలస్యానికి అసలు కారణం ప్రాచీన కాలపు సమస్యలు కావు, నేటి ఆధునిక 'గూగుల్ మ్యాప్స్' అంటూ ఒక నెటిజన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో రూపొందించిన ఫన్నీ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లను విపరీతంగా నవ్వుల్లో ముంచెత్తుతోంది.

గూగుల్ మ్యాప్ తిప్పలు

ఈ వైరల్ ఏఐ వీడియోలో ఒడిస్సియస్‌కు తన సైనికులు పాతకాలపు కాగితపు మ్యాప్‌ను ఇవ్వగా, దానిని ఆయన పక్కన పడేసి నేటి టెక్నాలజీపై నమ్మకంతో తన స్మార్ట్‌ఫోన్ తీసి గూగుల్ మ్యాప్స్‌లో "హోం టౌన్ ఇథాకా" అని వాయిస్ సెర్చ్ చేస్తాడు. కానీ గూగుల్ మ్యాప్స్ ఏమో గ్రీస్ లోని ఇథాకాను కాకుండా అమెరికాలోని "న్యూయార్క్‌లో ఉన్న ఇథాకా"ను చూపిస్తూ ఆయన్ను తీవ్రంగా విసిగిస్తుంది. అంతేకాకుండా స్వగ్రామానికి దాదాపు దగ్గరగా చేరుకున్న సమయంలో కూడా అనవసరంగా "యూ-టర్న్" తీసుకోమని, వేరే సుదూర మార్గంలో వెళ్లమని, సముద్రంలో భారీ ట్రాఫిక్ ఉందంటూ సూచనలు ఇస్తుంది. మన నిత్య జీవితంలో కూడా అడ్రస్ మన పక్కనే ఉన్నా గూగుల్ మ్యాప్స్ చూపించే విచిత్రమైన దారుల వల్ల మనం పడే తిప్పలు అందరికీ అనుభవమే కావడంతో, ఒడిస్సియస్ స్వదేశానికి చేరడానికి పదేళ్లు పట్టడానికి గూగుల్ మ్యాప్సే ప్రధాన కారణమంటూ సాగుతున్న ఈ మీమ్ వీడియో సోషల్ మీడియా వేదికలపై విశేషంగా ఆకట్టుకుంటోంది.

Next Story