రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం..? ప్రధాని ఇంటి వద్ద తోపులాటలో గాయాలు

by Ramesh Naini |

నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో విద్యార్థులకు మద్దతుగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రతిపక్ష నాయకులు మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.

రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం..? ప్రధాని ఇంటి వద్ద తోపులాటలో గాయాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారంలో విద్యార్థులకు మద్దతుగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రతిపక్ష నాయకులు మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో ప్రధాని నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

తోపులాటలో రాహుల్ గాంధీకి గాయాలు..?

నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో తీవ్ర పెనుగులాట, తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు రాహుల్ గాంధీని ఈడ్చుకెళ్లి బస్సులోకి ఎక్కించే సమయంలో ఆయన ముక్కు, కంటి కింద, ఛాతీ భాగంలో స్వల్ప గాయాలయ్యాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాహుల్ గాంధీ ముక్కు వద్ద చిన్న గాయమై రక్తం కనిపిస్తున్నట్లుగా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే అది చిన్న గాయమేనని, ఆందోళన చెందాల్సిన పనిలేదని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.

పోలీసులను నిరోధించిన ప్రియాంక, అఖిలేష్ అరెస్ట్

రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఎన్‌సీపీ (ఎస్‌పీ) నాయకురాలు సుప్రియా సూలే తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు బలవంతంగా బస్సులోకి తోసేందుకు యత్నించగా ప్రియాంక గాంధీ తీవ్రంగా నిరోధించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరెస్ట్ చేసిన అనంతరం రాహుల్ గాంధీని ఛత్రసాల్ స్టేడియానికి, ప్రియాంక గాంధీని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు తరలించి.. రాత్రి సమయంలో విడుదల చేశారు.

చర్చల ప్రతిపాదన తిరస్కరణ:

మల్లికార్జున ఖర్గే నివాసం నుంచి అకస్మాత్తుగా బయలుదేరిన నేతలు ప్రధాని నివాసం వద్ద బైఠాయించారు. కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్, హోం కార్యదర్శి గోవింద్ మోహన్ నిరసన స్థలానికి వచ్చి పార్లమెంట్‌లో చర్చకు ఆహ్వానించినప్పటికీ, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు వెనక్కి తగ్గేది లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. నాయకుల అరెస్టులతో ప్రభుత్వంపై తమ నిరసన తీవ్రత తగ్గదని కాంగ్రెస్ తెలిపింది.

Next Story