25 మంది ఈఈలకు ఎస్ఈ ప్రమోషన్లు.. 40 మంది డీఈఈలకు ఈఈలుగా పదోన్నతి!

by Ramesh Naini |

పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగంలో ఇంజినీర్లకు పదోన్నతులు కల్పించే ప్రక్రియ వేగం పుంజుకుంది.

25 మంది ఈఈలకు ఎస్ఈ ప్రమోషన్లు.. 40 మంది డీఈఈలకు ఈఈలుగా పదోన్నతి!
X

దిశ, తెలంగాణ బ్యూరో: పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజినీరింగ్ (పీహెచ్‌&ఎంఈ) విభాగంలో ఇంజినీర్లకు పదోన్నతులు కల్పించే ప్రక్రియ వేగం పుంజుకుంది. త్వరలోనే 25 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు (ఈఈ) సూపరింటెండెంట్ ఇంజినీర్లుగా (ఎస్ఈ), మరో 40 మంది డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు (డీఈఈ) ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లుగా (ఈఈ) పదోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ప్రమోషన్లకు సంబంధించిన 65 మంది అధికారుల తాత్కాలిక సీనియారిటీ జాబితాను పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం విడుదల చేసింది. సీనియారిటీ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిని ఈఎన్‌సీ (ఇంజినీర్-ఇన్-చీఫ్) దృష్టికి తీసుకురావాలని అధికారులు సూచించారు.

అభ్యంతరాలతో పాటు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను కూడా పరిశీలించిన అనంతరం తుది సీనియారిటీ జాబితాను ప్రకటించనున్నారు. ఆ తర్వాత సీనియారిటీ ఆధారంగా పదోన్నతుల ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యేందుకు సుమారు 20 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం విభాగంలో 30 సూపరింటెండెంట్ ఇంజినీర్, 70 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, 100 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం అసోసియేషన్ నాయకులు తెలిపారు. ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను ప్రమోషన్ల ద్వారానే భర్తీ చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో వెలువడనున్న ప్రమోషన్ ఉత్తర్వులపై విభాగంలోని ఇంజినీర్లలో ఆసక్తి నెలకొంది.

Next Story