జాతీయ రహదారి విస్తరణలో నాణ్యత లోపం..!

by Batti.Sumithra |

రూ.1,200 కోట్ల భారీ వ్యయంతో మదీనాగూడ నుంచి సంగారెడ్డి వరకు చేపడుతున్న జాతీయ రహదారి–65 విస్తరణ పనుల్లో జరుగుతున్న తీవ్ర నిర్లక్ష్యం, నాణ్యత లోపాలపై పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

జాతీయ రహదారి విస్తరణలో నాణ్యత లోపం..!
X

దిశ, పటాన్ చెరు టౌన్ : రూ.1,200 కోట్ల భారీ వ్యయంతో మదీనాగూడ నుంచి సంగారెడ్డి వరకు చేపడుతున్న జాతీయ రహదారి–65 విస్తరణ పనుల్లో జరుగుతున్న తీవ్ర నిర్లక్ష్యం, నాణ్యత లోపాలపై పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సౌకర్యం కోసం చేపట్టిన అభివృద్ధి పనులను కొందరు కాంట్రాక్టర్లు తమ స్వార్థ ప్రయోజనాలకు వేదికగా మార్చుకున్నారని మండిపడ్డారు. మంగళవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో జాతీయ రహదారుల సంస్థ అధికారులు, కాంట్రాక్టర్ సంస్థ ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని బీహెచ్‌ఈఎల్ చౌరస్తా నుంచి రుద్రారం గణేష్‌గడ్డ వరకు జరుగుతున్న రహదారి విస్తరణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పూర్తిగా గాలికొదిలేశారని ఆయన ఆరోపించారు. నిర్మించిన కొద్ది రోజులకే సర్వీస్ రోడ్లు దెబ్బతినడం, వర్షపు నీటి కాలువలు కూలిపోవడం అధికారుల పర్యవేక్షణ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు.

రహదారి విస్తరణలో వెలికితీసిన విలువైన మట్టిని ప్రజా అవసరాలకు వినియోగించకుండా ప్రైవేట్ సంస్థలకు అమ్ముకోవడం అత్యంత బాధాకరమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులకు ఆ మట్టిని అందించాలని ఎన్నిసార్లు కోరినా స్పందించకపోవడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. రహదారి విస్తరణలో తొలగించిన మహనీయుల విగ్రహాలను పటాన్ చెరు సాకి చెరువు కట్టపై ప్రతిష్ఠించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడం ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని అన్నారు. ఇప్పటివరకు 20 సార్లకు పైగా సమీక్ష సమావేశాలు నిర్వహించినా పనుల్లో ఎలాంటి మార్పు కనిపించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. కాంట్రాక్టర్లు, అధికారులు వెంటనే తమ పనితీరును మార్చుకుని నాణ్యతతో పనులు పూర్తి చేయాలని, లేకపోతే ప్రజల తరఫున కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు పూర్తి వివరాలతో ఫిర్యాదు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా చేస్తానని హెచ్చరించారు. ఈ సమీక్ష సమావేశంలో జాతీయ రహదారుల సంస్థ డీఈ సందీప్, కాంట్రాక్టర్ సంస్థ ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Next Story