మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు

by Batti.Sumithra |

నర్సాపూర్ బస్టాండ్ సమీపంలో హత్యకు గురైన మహిళ కేసును పోలీసులు ఛేదించారు. తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐ రంగకృష్ణ, ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డిలతో కలిసి కేసు వివరాలను వెల్లడించారు.

మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు
X

దిశ, నర్సాపూర్ : నర్సాపూర్ బస్టాండ్ సమీపంలో హత్యకు గురైన మహిళ కేసును పోలీసులు ఛేదించారు. తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐ రంగకృష్ణ, ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డిలతో కలిసి కేసు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీన నర్సాపూర్ బస్టాండ్ సమీపంలో ఓ మహిళ గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనట్లు తెలిపారు. దీంతో గుర్తుతెలియని మహిళ మృతదేహంగా కేసునమోదు చేశామని చెప్పారు. ఈ క్రమంలో సామాజిక మాధ్యమాల్లో ఈ వార్త సంచలనం కావడంతో, ఆ మహిళ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారని తెలిపారు. హత్యకు గురైన మహిళ కొల్చారం మండలం వరిగుంటం గ్రామానికి చెందిన మెట్ట శేఖమ్మ (40)గా గుర్తించినట్లు వెల్లడించారు. ఈ హత్యకు సంబంధించిన మహిళ మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని, పోస్టుమార్టంలో కూడా వైద్యులు స్పష్టమైన కారణాన్ని నిర్ధారించలేకపోయారని అన్నారు.

కాగా, మహిళ చేతులు ఎందుకు కట్టివేయబడి ఉన్నాయనే కోణంలో కేసును విచారించినట్లు తెలిపారు. విచారణలో లభించిన సమాచారం మేరకు, ఆ రోజు రాత్రి మహిళ ఒంటరిగా బస్టాండ్‌లో ఉండగా, శివంపేట మండలం చెన్నాపూర్ గ్రామ పరిధిలోని సామ్య తండాకు చెందిన కాట్రోత్ సురేష్ అనే యువకుడు ఆమెతో మాటలు కలిపి, కల్లు తెచ్చుకుని ఇద్దరూ సేవించినట్లు తెలిపారు. మత్తులో ఇద్దరూ శారీరకంగా కలిసే క్రమంలో ఆమె అతడిని చేతులతో నెట్టివేయగా, అక్కడే ఓ తాడుతో మహిళ చేతులు కట్టివేసి, ఆమె అరవకుండా చేతులతో నోరు మూసివేయడంతో ఊపిరాడక మృతి చెందినట్లు తెలిపారు. అనంతరం నిందితుడు మృతురాలి వద్ద ఉన్న రెండు సెల్‌ఫోన్లను తీసుకుని అక్కడి నుంచి పరారైనట్లు పేర్కొన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిందితుడు సురేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, తానే అత్యాచారం చేసి హత్య చేసినట్లు విచారణలో ఒప్పుకున్నాడని తెలిపారు. నిందితుడి వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని అతడిని రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. ఈ కేసును సీఐ రంగకృష్ణ, ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డిలు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నాలుగు రోజుల్లో ఛేదించారని తెలిపారు. ఇందుకు వారిని అభినందిస్తూ, రివార్డు కూడా అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీఐ రంగకృష్ణ, ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డితో పాటు ఇతర పోలీసులు పాల్గొన్నారు.

Next Story