రహదారి ప్రమాదాల నివారణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

by Jakkula.Mamatha |

రహదారి ప్రమాదాలతో ఏటా ఎంతో మంది మృత్యువాత పడటమే కాక క్షతగాత్రులుగా మారుతున్నారని, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ రహదారి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.

రహదారి ప్రమాదాల నివారణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
X

దిశ, గద్వాల కలెక్టరేట్ : రహదారి ప్రమాదాలతో ఏటా ఎంతో మంది మృత్యువాత పడటమే కాక క్షతగాత్రులుగా మారుతున్నారని, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ రహదారి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలపై మంగళవారం హైదరాబాద్ నుంచి బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రహదారుల భద్రతకు తమ వంతుగా కృషి చేస్తుందని, ఆయా జిల్లాల పరిధిలోని సంబంధిత శాఖల అధికారులు వారికి సహకరించాలన్నారు. రవాణా, పోలీస్, ఆర్ అండ్ బి, తదితర శాఖల అధికారులతో కలిసి జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీలను ఎన్నుకోవాలన్నారు. జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీలు, హైవే సేఫ్టీ టాస్క్ ఫోర్స్ కమిటీలతో కలిసి పని చేసేందుకు తరచూ సమావేశాలు నిర్వహించాలన్నారు. ఐడిఓసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి సంబంధిత శాఖల అధికారులతో కలిసి వీసీ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ వీసీ అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడారు.

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, రోడ్ సేఫ్టీ కమిటీలు ఇప్పటివరకు రహదారి భద్రతపై నిర్వహించిన కార్యక్రమాల వివరాలను అడిగారు. హైవేలపై పెట్రోలింగ్ వాహనాల సేవలు, బ్లాక్ స్పాట్ల వద్ద తీసుకుంటున్న జాగ్రత్తలపై మాట్లాడారు. హైవే స్థలాలను ఆక్రమించి ఏర్పాటు చేసిన డాబాలు, ఇతర నిర్మాణాల యజమానులకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. హైవేల భద్రతకు సంబంధించి ఇదివరకు నిర్వహించిన కార్యక్రమాలు, సమావేశాలు, భవిష్యత్తులో చేయబోయే కార్యాచరణ ప్రణాళిక పై ఎప్పటికప్పుడు సమగ్ర నివేదికలను సమర్పించాలని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో కలెక్టరేట్ ఇన్చార్జి ఏవో మంజుల, నేషనల్ హైవే రేసిడెంట్ ఇంజనీర్ బాలచందర్, రవాణా, ఆర్ అండ్ బీ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story