- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మక్తల్‌లో పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణల కూల్చివేత.. రోడ్డు పనుల పునరుద్ధరణ
మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం తీవ్ర ఉద్రిక్తత మధ్య రోడ్డు ఆక్రమణల కూల్చివేత కార్యక్రమం జరిగింది.

దిశ, మక్తల్: మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం తీవ్ర ఉద్రిక్తత మధ్య రోడ్డు ఆక్రమణల కూల్చివేత కార్యక్రమం జరిగింది. మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించిన కొందరు వ్యక్తులు అధికారులతో వివాదానికి దిగడంతో, పోలీసులు రంగంలోకి దిగి భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. అనంతరం నిలిచిపోయిన రోడ్డు నిర్మాణ పనులను పునరుద్ధరించారు. మున్సిపాలిటీ ఇంజనీర్ నాగ శివ తెలిపిన వివరాల ప్రకారం.. మక్తల్ మున్సిపాలిటీ లోని అన్ని వార్డుల్లో డ్రైనేజీలు, రోడ్ల నిర్మాణాల కోసం మంత్రి వాకిటి శ్రీహరి కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేశారు. ఇందులో భాగంగా గత ఏడాది పట్టణంలోని జాతీయ రహదారి రాయచూరు రోడ్డు నుండి గుర్లపల్లి రోడ్డు వరకు రూ. 3 కోట్ల వ్యయంతో, 800 మీటర్ల పొడవునా రెండు వరుసల రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు మంత్రి భూమి పూజ చేశారు. ఈ నిధులతో నిబంధనల మేరకు ఇప్పటికే 500 మీటర్ల మేర పనులను అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు.
అయితే, కాలనీలోకి ప్రవేశించే ప్రధాన మార్గంలో మిగిలిన 300 మీటర్ల రోడ్డు నిర్మాణం చేపట్టే క్రమంలో వివాదం తలెత్తింది. ముగ్గురు వ్యక్తులు రోడ్డు స్థలాన్ని ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టడంతో రోడ్డు వెడల్పు పనులు నిలిచిపోయాయి. ఆ ఆక్రమణలను తొలగించుకోవాలని మున్సిపల్ అధికారులు పలుమార్లు చెప్పినప్పటికీ వారు వినకపోగా, అధికారులపైనే తిరగబడ్డారు. ఆక్రమణదారుల వైఖరితో పనులు ముందుకు సాగకపోవడంతో, ఆదివారం ఇంజనీర్ నాగ శివ పోలీసుల సహకారం కోరారు. పోలీసులు రంగంలోకి దిగి రక్షణ కల్పించడంతో అధికారులు ఆక్రమణలను పూర్తిగా కూల్చివేశారు. వివాదం సర్దుమణగడంతో డ్రైనేజీ నిర్మాణం, రోడ్డు వెడల్పు పనులను అధికారులు వేగంగా కొనసాగిస్తున్నారు.






