Bioeconomy: భారత బయోటెక్ రంగానికి నీతి ఆయోగ్ కొత్త రోడ్‌మ్యాప్

by S Gopi |

ప్రస్తుతం విడివిడిగా అమలవుతున్న పథకాల స్థానంలో ఆరు లక్ష్య-ఆధారిత జాతీయ మిషన్లు ప్రారంభించాలని సూచించింది.

Bioeconomy: భారత బయోటెక్ రంగానికి నీతి ఆయోగ్ కొత్త రోడ్‌మ్యాప్
X

దిశ, బిజినెస్ బ్యూరో: జీవశాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని కొత్త మందులు, మెరుగైన విత్తనాలు, బయోఫ్యూయెల్స్, పారిశ్రామిక ఉత్పత్తులను రూపొందించే బయోటెక్నాలజీ రంగానికి సంబంధించి దేశంలో కీలక మార్పులు జరగనున్నాయి. ఈ రంగం చుట్టూ ఏర్పడే వ్యాపార, పారిశ్రామిక బయోఎకానమీలో భారత్‌ను ప్రపంచ శక్తిగా మార్చేందుకు నీతి ఆయోగ్ కొత్త రోడ్‌మ్యాప్‌ను విడుదల చేసింది. భారత బయోటెక్నాలజీ రంగాన్ని పూర్తిగా కొత్త దిశలో తీసుకెళ్లే వ్యూహాన్ని నీతి ఆయోగ్ ప్రతిపాదించింది. ప్రస్తుతం విడివిడిగా అమలవుతున్న పథకాల స్థానంలో ఆరు లక్ష్య-ఆధారిత జాతీయ మిషన్లు ప్రారంభించాలని సూచించింది. వీటి ద్వారా పరిశోధనలను వేగంగా మార్కెట్‌కు తీసుకురావడం, దేశీయ తయారీని పెంచడం, ప్రపంచ స్థాయి బయోటెక్ కంపెనీలను దేశీయంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రతిపాదనలు తాజాగా విడుదల చేసిన బయోఎకానమీ రోడ్‌మ్యాప్‌లో ఉన్నాయి. ఈ రోడ్‌మ్యాప్ ప్రకారం 2035 నాటికి భారత బయోఎకానమీని 691 బిలియన్ డాలర్ల(రూ. 66.53 లక్షల కోట్ల)తో భారీ ఆర్థిక సామర్థ్యాన్ని నిర్మించాలని నీతి ఆయోగ్ అంచనా వేస్తోంది.

రూ. 50,000 కోట్ల గ్రోత్ ఫండ్

బయోటెక్ రంగంలో ప్రయోగశాల (ల్యాబ్)లో జరిగే ఆవిష్కరణలు వాణిజ్యపరంగా మార్కెట్‌లోకి విజయవంతంగా అడుగుపెట్టేందుకు ఉన్న అంతరాన్ని పూడ్చడమే ఈ రోడ్‌మ్యాప్ అసలు సిసలైన లక్ష్యం. దీనికోసం 2026-2035 దశాబ్ద కాలానికి గాను రూ. 50,000 కోట్ల భారీ బయోఎకానమీ గ్రోత్ ఫండ్ ఏర్పాటు చేయాలని నీతి ఆయోగ్ ప్రతిపాదించింది. ఈ నిధులతో పాటు దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు పీఎల్‌ఐ తరహా రాయితీలను ఇవ్వాలని, మేధో సంపత్తి ఆమోదాలను వేగవంతం చేసేందుకు ఒక ఫాస్ట్-ట్రాక్ వ్యవస్థను, ఒక జాతీయ బయోడేటా కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చింది.

ప్రస్తుతం బయోటెక్ రంగంలో ఆరోగ్యం, వ్యవసాయం, పారిశ్రామిక బయోటెక్నాలజీ, వ్యాధులు వంటి అనేక రంగాల్లో కార్యక్రమాలు ఉన్నప్పటికీ అవి ఒకే లక్ష్యంతో ముందుకు సాగడం లేదని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది. అందుకే రంగాలవారీగా కాకుండా ఫలితాల ఆధారంగా పనిచేసే మిషన్ మోడ్‌కు మారాలని సూచించింది.

ఆరు జాతీయ మిషన్లు

* జీన్ ఇండియా: అందుబాటు ధరల్లో జన్యు, కణ చికిత్సలు, ప్రెసిషన్ డయాగ్నోస్టిక్స్‌ను ప్రజలకు చేరవేయడం.

* అగ్రిబయో 2.0: వాతావరణ మార్పులను తట్టుకునే పంట రకాలు, నాణ్యమైన బయో-ఇన్‌పుట్‌ల అభివృద్ధి.

* బయోఎక్స్ ఫౌండ్రీ: సింథటిక్ బయాలజీలో జరిగే పరిశోధనలను ల్యాబ్‌ల నుంచి నేరుగా వాణిజ్య ఉత్పత్తులుగా మార్చడం.

* వన్ హెల్త్ గ్రిడ్: ఏఐ ఆధారిత వ్యాధి నిఘా వ్యవస్థను బలోపేతం చేసి, మహమ్మారులను ముందుగానే గుర్తించే సామర్థ్యాన్ని పెంచడం.

* మెరైన్ బయోటెక్నాలజీ మిషన్: సముద్రపు పాచి సాగు, సముద్ర జీవ వనరుల ఆధారిత ఉత్పత్తులు, బ్లూ ఎకానమీ అభివృద్ధి.

* బయోఫార్మా నెక్స్ట్: తదుపరి తరం బయోలాజిక్స్, బయోసిమిలార్స్, వ్యాక్సిన్లు, ఏఐ ఆధారిత ఔషధ పరిశోధనలో భారత్‌ను ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దడం.

అమలుకు కొత్త సంస్థలు

ఈ మిషన్ల అమలును పర్యవేక్షించేందుకు నాలుగు కీలక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నీతి ఆయోగ్ సూచించింది.

* జాతీయ బయోమిషన్లపై సాధికార కమిటీ

* జాతీయ బయోడేటా కౌన్సిల్

* బయోఎకానమీ పెట్టుబడి, విధాన వేదిక

* మేధో సంపత్తి ఆమోదాలకు ఫాస్ట్-ట్రాక్ వ్యవస్థ

ఇవి వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని పెంచడంతో పాటు, బయోటెక్ డేటా నిర్వహణ, పెట్టుబడులు, కొత్త ఆవిష్కరణలు మార్కెట్‌లోకి త్వరగా రావడానికి దోహదపడతాయని పేర్కొంది.

భారీ వృద్ధిపై అంచనా

గత పదేళ్లలో భారత బయోఎకానమీ 16 రెట్లు పెరిగి 195.3 బిలియన్ డాలర్ల(రూ. 18.80 లక్షల కోట్ల)కు చేరిందని నీతి ఆయోగ్ రోడ్‌మ్యాప్ తెలిపింది. ప్రస్తుతం ఇది దేశ జీడీపీలో 4.8 శాతం వాటా కలిగి ఉంది. కొత్త వ్యూహం విజయవంతమైతే 2035 నాటికి ఈ రంగం రూ. 66.53 లక్షల కోట్లకు చేరుకోవచ్చని నీతి ఆయోగ్ అంచనా వేస్తోంది. అలాగే 3 కోట్లకు పైగా ఉద్యోగాలు సృష్టించడంతో పాటు, ప్రపంచ స్థాయిలో పోటీపడే 15 భారతీయ బయోటెక్ కంపెనీలు ఆవిర్భవించే అవకాశముందని పేర్కొంది.

Next Story