Credit Cards: కొత్త క్రెడిట్ కార్డుల్లో సగం జెన్‌జీలదే

by S Gopi |

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, వారిలో దాదాపు సగం మంది సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాల నుంచే ఉండటం విశేషం.

Credit Cards: కొత్త క్రెడిట్ కార్డుల్లో సగం జెన్‌జీలదే
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఒకప్పుడు క్రెడిట్ కార్డు అంటే పెద్ద నగరాల్లో ఉద్యోగాలు చేసే, మంచి ఆదాయం ఉన్నవారి ఆర్థిక సాధనం. ఇప్పుడు ఆ పరిస్థితి వేగంగా మారుతోంది. దేశంలో తొలిసారి క్రెడిట్ కార్డు తీసుకుంటున్న వారిలో సగం మంది ఇప్పుడు జెన్‌జీ (30 ఏళ్లలోపు యువత) ఉన్నారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, వారిలో దాదాపు సగం మంది సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాల నుంచే ఉండటం విశేషం. ట్రాన్స్‌యూనియన్ సిబిల్ విడుదల చేసిన 'బియాండ్ ది స్వైప్ 2026' నివేదిక ప్రకారం, యువతలో అధికారిక రుణాల వినియోగం పెరగడం, చిన్న పట్టణాలు కూడా క్రెడిట్ మార్కెట్‌లో కీలక పాత్ర పోషించడం భారత క్రెడిట్ కార్డ్ రంగంలో పెద్ద మార్పుకు సంకేతమని పేర్కొంది.

కొత్త కార్డుల్లో సగం జెన్‌జీదే

2026 మార్చి నాటికి, మొదటిసారి క్రెడిట్ కార్డు తీసుకుంటున్న వారిలో 50 శాతం మంది 30 ఏళ్లలోపు ఉన్నారు. నాలుగేళ్ల క్రితం ఈ వాటా 43 శాతం మాత్రమే. అదే సమయంలో, కొత్త కార్డ్ హోల్డర్లలో 46 శాతం మంది సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు. 2022లో ఇది 42 శాతంగా ఉంది. అంటే, క్రెడిట్ కార్డులు ఇకపై మెట్రో నగరాలకే పరిమితం కావడం లేదని ఈ గణాంకాలు చెబుతున్నాయి. గత పదేళ్లలో భారత క్రెడిట్ కార్డ్ మార్కెట్ భారీగా విస్తరించింది. 2016లో క్రెడిట్ కార్డ్ హోల్డర్లు 1.4 కోట్లు ఉండగా, ఇది 2026 నాటికి 5.2 కోట్లకు చేరింది. ఇదే సమయంలో క్రెడిట్ కార్డ్ బకాయిలు కూడా భారీగా పెరిగాయి. 2016లో సుమారు రూ. 40,000 కోట్లు ఉండగా, ఇప్పుడు అది రూ. 3.1 లక్షల కోట్లకు చేరింది. ప్రతి కార్డ్ హోల్డర్‌పై సగటు బకాయి కూడా రూ. 31 వేల నుంచి రూ. 65 వేల వరకు పెరిగింది.

వృద్ధితో పాటు కొత్త సవాలు కూడా

క్రెడిట్ కార్డ్ మార్కెట్ గత పదేళ్లలో వేగంగా పెరిగినా, ఇప్పుడు వృద్ధి కొంత నెమ్మదించిందని ట్రాన్స్‌యూనియన్ సిబిల్ ఎండీ, సీఈఓ భవేష్ జైన్ తెలిపారు. వ్యక్తిగత రుణాలు, కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్లు, ఇతర రిటైల్ రుణాలు వేగంగా పెరగడంతో, క్రెడిట్ కార్డులు ఇప్పుడు వాటితో పోటీ పడాల్సి వస్తోంది.

జెన్‌జీల ఖర్చు కూడా ఎక్కువే

యువత కార్డు తీసుకున్న వెంటనే ఖర్చు కూడా అంతే వేగంగా చేస్తున్నారు. మొదటి క్రెడిట్ కార్డు తీసుకున్న మూడు నెలల్లోనే 28 శాతం మంది జెన్‌జీ కస్టమర్ల బకాయి రూ. 25 వేలకుపైగా ఉంటోంది. అంతేకాకుండా, 69 శాతం మంది జెన్‌జీ కస్టమర్లు మొదటి క్రెడిట్ కార్డు తీసుకున్న ఏడాది లోపే మరో లోన్ కూడా తీసుకుంటున్నారు. మిలీనియల్స్‌లో ఈ సంఖ్య 55 శాతం మాత్రమే ఉంది.

ప్రపంచంతో పోలిస్తే భారత్ ఎక్కడ ఉంది?

ఈ స్థాయిలో వృద్ధి ఉన్నప్పటికీ, దేశంలో క్రెడిట్ కార్డుల వినియోగం ఇంకా ప్రారంభ దశలోనే ఉందని భవేష్ జైన్ అన్నారు. ప్రస్తుతం క్రెడిట్ యాక్టివ్ వినియోగదారుల్లో కేవలం 25 శాతం మందికే క్రెడిట్ కార్డు ఉంది. ఇతర దేశాల్లో ఈ సంఖ్య చాలా ఎక్కువ. కొలంబియాలో 62 శాతం, యూకేలో 70 శాతం, హాంగ్‌కాంగ్‌లో 98 శాతంగా ఉంది.

Next Story