'కమిటీ కుర్రోళ్ళ'కు జాతీయ అవార్డులు.. నిహారిక ఏం చేసిందో తెలుసా?

by Muthe.Rajitha |

72వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్(72nd National Film Awards) శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే.

కమిటీ కుర్రోళ్ళకు జాతీయ అవార్డులు.. నిహారిక ఏం చేసిందో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : 72వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్(72nd National Film Awards) శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలలో తెలుగు నుంచి 'కమిటీ కుర్రోళ్లు' (Committee Kurrollu) చిత్రం జాతీయ స్థాయిలో అద్భుతమైన సత్తా చాటింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రాల విభాగంతో పాటు బెస్ట్ మేకప్ విభాగంలోనూ ఈ చిత్రం జాతీయ అవార్డులకు ఎంపికై టాలీవుడ్ ఖ్యాతిని జాతీయ వేదికపై సగర్వంగా నిలబెట్టింది. నూతన దర్శకుడు యదు వంశీ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని, మెగా డాటర్ కొణిదెల నిహారిక తన సొంత బ్యానర్ 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' పై ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. దాదాపు అంతా కొత్త నటీనటులతో, గ్రామీణ నేపథ్యం, స్నేహం చుట్టూ తిరిగే వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమా, థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే ఘన విజయాన్ని సాధించింది. ఇప్పుడు కమర్షియల్ సక్సెస్‌తో పాటు ఏకంగా నేషనల్ అవార్డులను కూడా సొంతం చేసుకోవడంతో ఈ చిత్రం టాలీవుడ్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది.

అయితే ఈ అవార్డుల ప్రకటనను చిత్ర యూనిట్ సభ్యులందరితో కలిసి నిహారిక ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఎంతో ఉత్కంఠగా తిలకించారు. బెస్ట్ రీజినల్ ఫిల్మ్ కేటగిరీలో 'కమిటీ కుర్రోళ్లు' పేరు వినపడగానే నిర్మాత నిహారికతో పాటు చిత్ర బృందం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. జాతీయ అవార్డు దక్కిన ఆనందంలో నిహారిక చిన్నపిల్లలా గంతులు వేస్తూ, కేరింతలు కొడుతూ తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. అక్కడే ఉన్న నటీనటులు, సాంకేతిక నిపుణులు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ, డ్యాన్స్‌లతో హాల్‌లోనే భారీ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ అపురూపమైన విజయానికి సంబంధించిన సంబరాల వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కేవలం జాతీయ అవార్డులే కాకుండా, అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించిన ‘గద్దర్ అవార్డుల్లో’ కూడా ఈ చిత్రం పలు పురస్కారాలను దక్కించుకున్న సంగతి తెలిసిందే.

Next Story