సీఎం పోస్టుకు కేజ్రీవాల్‌ రాజీనామా చేయకపోవడంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

by Dishanational4 |
సీఎం పోస్టుకు కేజ్రీవాల్‌ రాజీనామా చేయకపోవడంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో : గత నెల రోజులుగా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నా అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయకపోవడంపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేజ్రీవాల్‌కు జాతీయ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమని అనిపిస్తోందని న్యాయస్థానం పేర్కొంది. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి మొత్తం ఆసక్తి అధికారంపైనే ఉందని తెలిపింది. ఢిల్లీలోని మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందుబాటులో లేవంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించే క్రమంలో ఢిల్లీ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విద్యార్థుల కష్టాలను చూసి ఢిల్లీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ మొసలి కన్నీరు కారుస్తున్నారని కోర్టు కామెంట్స్ చేసింది. కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ నుంచి పాలన సాగిస్తున్నందు వల్లే ఢిల్లీ విద్యార్థులు, ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని పేర్కొంది.

స్టాండింగ్ కమిటీ లేకపోవడంతో..

రూ.5 కోట్ల కంటే ఎక్కువ విలువైన ప్రభుత్వ కాంట్రాక్టులను కేటాయించాలంటే ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన స్టాండింగ్ కమిటీ నుంచి ఆమోదం పొందాలి. అయితే అరవింద్ కేజ్రీవాల్ జైలులో ఉండటంతో ప్రస్తుతం ఢిల్లీలో ఈ కమిటీ యాక్టివ్‌గా లేదు. ఫలితంగా విద్యార్థుల యూనిఫామ్‌లు, పుస్తకాలు, స్కూల్ బ్యాగ్స్, స్టేషనరీకి సంబంధించిన కాంట్రాక్టుల కేటాయింపులు సకాలంలో జరిగే అవకాశం లేకుండాపోయింది. ఈనేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన మున్సిపల్ పాఠశాలల్లో పుస్తకాలు, యూనిఫాంల పంపిణీ వ్యవహారంలో నేరుగా జోక్యం చేసుకునే అధికారం తమకు లేదని కోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ బాధ్యతల్లో లోటుపాట్లు స్పష్టంగా కనిపిస్తున్నందున వాటిని పరిష్కరించాలని ధర్మాసనం కోరింది. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ప్రస్తుతం ఆయన తిహార్ జైల్లో ఉన్నారు.



Next Story

Most Viewed