ఉన్నది ఉన్నట్టు: పొలిటికల్ పవర్ యాత్రలు

by Viswanth |
ఉన్నది ఉన్నట్టు: పొలిటికల్ పవర్ యాత్రలు
X

ఎవరెన్ని పాదయాత్రలు చేస్తున్నా అది వారి అధికార స్వార్థం కోసమే. ప్రజల బాధలకు విముక్తి కలిగించే దిశగా ఉంటే సార్థకత చేకూరుతుంది. 'ప్రజాప్రతినిధి' అనేది వారికి ఒక హోదాగా మారింది. బాధ్యత స్థానంలో అహంకారం నెలకొన్నది. అదే వారిని ప్రజలకు దూరం చేస్తున్నది. అందుకే నిలదీస్తున్నారు. ఘెరావ్ చేస్తున్నారు. నిరసనలు తెలుపుతున్నారు. ముఖ్యమంత్రికీ ఆ బాధ తప్పలేదు. ఏ యాత్ర చేసినా తమకు ఒరిగేదేమీ లేదని ప్రజలు గ్రహిస్తున్నారు. ఎన్టీఆర్, వైఎస్సార్ యాత్రలను చూసిన ప్రజలు ఇప్పటి నేతల తీరును నిశితంగా గమనిస్తున్నారు. ఎవరు ఏ యాత్ర చేసినా సమస్యలు పరిష్కారం అవుతాయనే భరోసా లేనంతవరకూ స్పందన అంతంతే అవుతుంది. అధికారాన్ని ఇస్తారా? ఆమడదూరంలోనే ఉంచుతారా? అనేది ప్రజల చేతులలోనే ఉన్నది.

రో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు, ఆ తరువాత లోక్‌సభ ఎన్నికలు రాబోతున్నాయి. అన్ని పార్టీలకూ అధికారం చేజిక్కించుకోవడమే ప్రధాన టాస్క్. దాని కోసం అవి విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్రం, దేశం అనే తేడా లేకుండా యాత్రలకు శ్రీకారం చుట్టాయి. రాష్ట్రం మీద ఫోకస్ పెట్టిన కొన్ని పార్టీల నేతలు రకరకాల పేర్లతో పాదయాత్రలు చేస్తున్నారు. జాతీయ స్థాయిలో పవర్‌లోకి రావడానికి కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ 'భారత్ జోడో యాత్ర' చేస్తున్నారు. ఏ యాత్ర చేసినా వారి టార్గెట్ ఒక్కటే. పాదయాత్రలు ఒకప్పటి సక్సెస్ ఫార్ములా. సీఎం కేసీఆర్ మాత్రం 'ఇది ఔట్‌ డేటెడ్ ట్రెండ్' అనే భావనతో ఉన్నారు. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా ఇది కొన్నిచోట్ల యాత్రల కాలం. మరి కొన్నిచోట్ల పాదయాత్రల సమయం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనే కొనసాగింది.

ఆ పార్టీకి వ్యతిరేకంగా 1982లో తెలుగుదేశం పార్టీ ఉనికిలోకి వచ్చింది. 'చైతన్య రథయాత్ర' పేరుతో ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మొత్తం రాష్ట్రాన్ని చుట్టేశారు. రోడ్డు పక్కనే బహిరంగ స్నానం, చెట్ల కింద సేదతీరడం, ప్రజలతో మాటామంతీ, వారి సమస్యలను ఓపిగ్గా వినడం, భవిష్యత్తుపై భరోసా కల్పించడం ఇలా ఆయన యాత్ర సాగింది. ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. మహిళలు మంగళహారతులు ఇచ్చారు. చివరకు అధికారాన్నే అప్పగించారు. రెండు రూపాయలకు కిలో బియ్యం, రిక్షా కార్మికులకు ఉచిత డ్రస్ ఇలాంటివన్నీ అమలులోకి వచ్చాయి.

తదనంతర కాలంలో

2003లో 'ప్రజాప్రస్థానం' పేరుతో రాష్ట్రంలో పాదయాత్ర చేసిన వైఎస్సార్ 2004లో అధికారం చేజిక్కించుకున్నారు. అప్పటి కరువు పరిస్థితి, ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఆయనను ఆ దిశగా ప్రేరేపించాయి. సుమారు 1,490 కి.మీ. వారాల తరబడి మండే ఎండలలో నడిచారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించి పవర్‌లోకి వచ్చారు. పాదయాత్రలో స్వయంగా చూసిన ప్రజల ఇబ్బందులకు పరిష్కారంగా సీఎం అయిన తర్వాత కొన్ని స్కీమ్‌లను ప్రవేశపెట్టారు. ఇప్పటికీ అవి అమలులోనే ఉన్నాయి. 2013లో 'వస్తున్నా మీ కోసం' అంటూ పాదయాత్ర చేసిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో పవర్‌లోకి వచ్చారు. ఆ తర్వాత వైఎస్సార్ కొడుకు జగన్ 2017లో 'ప్రజాసంకల్ప యాత్ర' పేరుతో ఆంధ్రప్రదేశ్‌ను పాదయాత్రతో చుట్టేసి అధికారంలోకి వచ్చారు. ఆయన చెల్లెలు షర్మిల సైతం 'మరో ప్రజాప్రస్థానం' పేరుతో పాదయాత్ర చేసి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు తెలంగాణలో అవే రిపీట్ అవుతున్నాయి.

తెలంగాణ సెంటిమెంట్‌తో టీఆర్ఎస్‌కు 2014లో యాత్ర చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. అదే సెంటిమెంట్ 2018లోనూ అధికారాన్ని అప్పగించింది. పాదయాత్రలు ఔట్‌డేటెడ్ అని స్వయంగా కేసీఆరే చెప్పినందున ఆ పార్టీ నేతలకు ఈ అవసరం ఉండకపోవచ్చు. ఇతర పార్టీల నేతలకు అనివార్యమైంది. వైఎస్సార్ టీపీ పేరుతో పార్టీ పెట్టిన షర్మిల 'ప్రజాప్రస్థానం' యాత్ర, ఐపీఎస్ పదవిని వదులుకుని బీఎస్పీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ 'బహుజన రాజ్యాధికార యాత్ర' చేస్తున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తన మధిర నియోజకవర్గంలో 'పీపుల్స్ మార్చ్' పేరుతో పాదయాత్ర పూర్తిచేశారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సైతం ఆలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు పాదయాత్ర చేసే ప్లాన్‌లో ఉన్నారు.

భారత్‌లో అనేక యాత్రలు

భారత చరిత్రలో అనేక యాత్రలు ప్రజలకు చిరపరిచితం. 1990లో 'మండల్-కమండల్' వివాదం ఉన్న సమయంలో అద్వానీ 'రథయాత్ర', 1983లో జనతాదళ్ నేత చంద్రశేఖర్ 'భారత్‌యాత్ర', 1985లో రాజీవ్‌గాంధీ 'భారత్ సందేశ్ యాత్ర', 1990లో 'భారత్‌యాత్ర', 1991లో బీజేపీ 'ఏక్తా యాత్ర', 2002లో మోడీ 'గుజరాత్ గౌరవ్ యాత్ర', దిగ్విజయ్ సింగ్ 'నర్మదా పరిక్రమ్ యాత్ర' జరిగాయి. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ పాదయాత్ర కూడా వామపక్షాల సుదీర్ఘ పాలనకు మంగళం పాడి అధికారాన్ని అందించింది. పాదయాత్రలకు మహాత్మాగాంధీ ఆద్యులు.

బ్రిటిష్ పాలకులు ఉప్పు మీద విధించిన పన్నుకు వ్యతిరేకంగా గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమం నుంచి 'దండి మార్చ్' పేరుతో పాదయాత్ర చేశారు. వలస పాలనకు వ్యతిరేకంగా ప్రజలలో చైతన్యం కలిగించడానికి ఈ యాత్ర తోడ్పడింది. ఉద్వేగ ప్రసంగాలతో ప్రజలలో జాతీయ సమైక్యతా భావాన్ని రగిల్చింది. ప్రజలందరి కామన్ టాస్క్ కోసం ఉపయోగపడింది. 80 మందితో మొదలు పెట్టిన ఈ యాత్రలో ఆ తర్వాత వేలాది మంది చేరారు. చివరకు బ్రిటిషు పాలన నుంచి విముక్తికి ఇది దారి తీసింది. 1950వ దశకంలో వినోభా భావే 'భూదాన్ ఉద్యమం' పేరుతో తెలంగాణలోని పోచంపల్లి నుంచి బిహార్‌లోని బోధ్‌గయ వరకు పాదయాత్ర చేశారు.

ఒక ఫార్ములాగా మారి

పాదయాత్రలు ఒక సక్సెస్ ఫార్ములా అని తెలుగు రాజకీయ నాయకులకు అర్థమైంది. అందుకే ఇప్పుడు తెలంగాణలో పాదయాత్రలో జోరు పెరిగింది. ప్రజల బాధలకు పరిష్కారం చూపేలా మేనిఫెస్టోలలో హామీల రూపంలో రిఫ్లెక్ట్ కావాలి. ఇప్పుడు జరుగుతున్న పాదయాత్రలలో అలాంటివేమీ లేవు. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ విడతలవారీగా 'ప్రజా సంగ్రామ యాత్ర' చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు ఫేజ్‌లు పూర్తయ్యాయి. తెలంగాణలో అధికారంలోకి రావడమే బీజేపీ లక్ష్యం. యాత్రలో ప్రజలు పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలపై నిలదీస్తున్నారు. వాటికి ఏ తీరులో ఉపశమనం కలిగిస్తారనే భరోసా కరువైంది. రాష్ట్రంలో టీఆర్ఎస్‌ను గద్దె దింపడమే ప్రధాన టార్గెట్‌గా మారింది.

ప్రజల సమస్యలను తెలుసుకోవడం, వాటికి పరిష్కారం కనుగొనడం, క్షేత్రస్థాయిలోని వైఫల్యాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం.. ఇవీ పాదయాత్రల ప్రధాన ఉద్దేశం. ఇప్పుడు నిర్వచనం మారిపోయింది. విపక్షాలను విమర్శించడం, భావోద్వేగాలను రెచ్చగొట్టడం, అధికారమే పరమావధిగా జరుగుతున్నాయి. పబ్లిసిటీ కోసం మాత్రమే ఉపయోగపడుతున్నాయి. ప్రజలతో మమేకమయ్యే అంశం పక్కన పెడితే కార్యకర్తలకే పరిమితమవుతున్నాయి. కొన్ని సందర్భాలలో రోజు కూలీ ఇచ్చి జనాలను సమీకరించుకోవాల్సి వస్తున్నది. బీరు, బిర్యానీ పొట్లాలు సరేసరి. గతంలో లాగ ఇప్పుడు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. పగలంతా రోడ్లమీద తిరిగినా మధ్యలో 'కారవాన్'లలో ఏసీ రూమ్‌లో విశ్రాంతి తీసుకునే లగ్జరీ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి.

అంతిమ ఫలితం?

ఎవరెన్ని పాదయాత్రలు చేస్తున్నా అది వారి అధికార స్వార్థం కోసమే. ప్రజల బాధలకు విముక్తి కలిగించే దిశగా ఉంటే సార్థకత చేకూరుతుంది. 'ప్రజాప్రతినిధి' అనేది వారికి ఒక హోదాగా మారింది. బాధ్యత స్థానంలో అహంకారం నెలకొన్నది. అదే వారిని ప్రజలకు దూరం చేస్తున్నది. అందుకే నిలదీస్తున్నారు. ఘెరావ్ చేస్తున్నారు. నిరసనలు తెలుపుతున్నారు.

ముఖ్యమంత్రికీ ఆ బాధ తప్పలేదు. ఏ యాత్ర చేసినా తమకు ఒరిగేదేమీ లేదని ప్రజలు గ్రహిస్తున్నారు. ఎన్టీఆర్, వైఎస్సార్ యాత్రలను చూసిన ప్రజలు ఇప్పటి నేతల తీరును నిశితంగా గమనిస్తున్నారు. ఎవరు ఏ యాత్ర చేసినా సమస్యలు పరిష్కారం అవుతాయనే భరోసా లేనంతవరకూ స్పందన అంతంతే అవుతుంది. అధికారాన్ని ఇస్తారా? ఆమడదూరంలోనే ఉంచుతారా? అనేది ప్రజల చేతులలోనే ఉన్నది.

ఎన్. విశ్వనాథ్

99714 82403


Next Story

Most Viewed