ఆర్టీసీ కార్గోలో నాలుగు బస్తాల పటిక కలకలం

by Batti.Sumithra |

సూర్యాపేట జిల్లా కోదాడలో ఆర్టీసీ కార్గో కేంద్రానికి చేరుకున్న నాలుగు బస్తాల అనుమానాస్పద సరుకు బుధవారం రాత్రి కలకలం రేపింది.

ఆర్టీసీ కార్గోలో నాలుగు బస్తాల పటిక కలకలం
X

దిశ, కోదాడ : సూర్యాపేట జిల్లా కోదాడలో ఆర్టీసీ కార్గో కేంద్రానికి చేరుకున్న నాలుగు బస్తాల అనుమానాస్పద సరుకు బుధవారం రాత్రి కలకలం రేపింది. రాజమహేంద్రవరం నుంచి కోదాడకు రవాణా అయిన ఈ బస్తాల్లో సారా తయారీలో వినియోగించే పటిక ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మొత్తం నాలుగు బస్తాల్లో సుమారు 200 కిలోల మేర పటిక ఉన్నట్లు సమాచారం. ఆర్టీసీ కార్గో కేంద్రంలో సరుకు దిగిన అనంతరం దాని స్వభావం పై అనుమానాలు వ్యక్తం కావడంతో నిఘా సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని కార్గో కేంద్రం నుంచి నిఘా, భద్రతా శాఖ కార్యాలయానికి తరలించి పరిశీలిస్తున్నారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ సరుకును పంపిన వ్యక్తిగా సింహాద్రి, స్వీకరించాల్సిన వ్యక్తిగా రవి పేర్లు నమోదైనట్లు తెలిసింది. అయితే బుకింగ్ సమయంలో నమోదు చేసిన ఫోన్ నంబర్‌కు అధికారులు పలుమార్లు సంప్రదించే ప్రయత్నం చేసినప్పటికీ, ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉన్నట్లు సమాచారం. దీంతో సరుకు పంపిన వారి వివరాల పై అనుమానాలు మరింత పెరిగాయి. ఇదిలా ఉండగా, ఆర్టీసీ అధికారులు బుకింగ్‌కు సంబంధించిన పూర్తి రికార్డులను పరిశీలిస్తున్నారు. గతంలో ఇదే పేర్లతో లేదా ఇదే చిరునామాలతో ఇలాంటి సరుకులు రవాణా అయ్యాయా అనే కోణంలో కూడా విచారణ చేపట్టారు. సరుకు ఎక్కడి నుంచి వచ్చింది, అసలు యజమానులు ఎవరు, ఎవరికి పంపించారు, దాని వినియోగం ఏమిటి అనే అంశాలపై లోతుగా ఆరా తీస్తున్నారు. పటికను అక్రమ మద్యం తయారీలో వినియోగించే అవకాశం ఉండటంతో అధికారులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. అవసరమైతే ఇతర శాఖల సహకారంతోనూ దర్యాప్తు చేపట్టనున్నట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారగా, పూర్తి వివరాలు అధికారిక విచారణ అనంతరం వెలుగులోకి వచ్చే అవకాశముంది.

Next Story