జాతీయ స్థాయిలో సత్తా... ఐదు ప్రతిష్టాత్మక అవార్డులు

by Vemula.Srinu Prasad |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐదు ప్రతిష్టాత్మక జాతీయ పంచాయతీ అవార్డులను కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాలను ప్రకటించింది. ..

జాతీయ స్థాయిలో సత్తా...  ఐదు ప్రతిష్టాత్మక అవార్డులు
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐదు ప్రతిష్టాత్మక జాతీయ పంచాయతీ అవార్డులను కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాలను ప్రకటించింది. ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లాకు చెందిన 'శృంగవరం' గ్రామం సుపరిపాలన (గుడ్ గవర్నెన్స్) విభాగంలో జాతీయ స్థాయిలో ప్రథమ స్థానాన్ని దక్కించుకోగా, మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిన తిరుపతి జిల్లా 'బొక్కసంపాలెం' పంచాయతీ ఉమెన్ ఫ్రెండ్లీ విభాగంలో మొదటి స్థానాన్ని సాధించింది. ఈ రెండు పంచాయతీలకు రూ.కోటి చొప్పున నగదు బహుమతి లభించింది.

జాతీయ స్థాయిలో సత్తా

పేదరిక నిర్మూలన, స్వయం సమృద్ధి విభాగాల్లోనూ రాష్ట్రానికి చెందిన పంచాయతీలు జాతీయ స్థాయిలో సత్తా చాటాయి. వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన 'చెమ్ములపల్లి' గ్రామం పేదరిక నిర్మూలన విభాగంలో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుని రూ.75 లక్షల నగదు బహుమతిని పొందింది. అలాగే, ప్రకాశం జిల్లాకు చెందిన 'గుండమాల' పంచాయతీ స్వయం సమృద్ధి విభాగంలో జాతీయ స్థాయిలో మూడో స్థానాన్ని సాధించి, రూ.50 లక్షల నగదు పురస్కారాన్ని తన ఖాతాలో వేసుకుంది.

సుస్థిరాభివృద్ధి విభాగంలో..

మరోవైపు పర్యావరణ పరిరక్షణ, వనరుల వినియోగం వంటి అంశాలతో కూడిన సుస్థిరాభివృద్ధి (సస్టైనబుల్ డెవలప్‌మెంట్) విభాగంలో చిత్తూరు జిల్లా 'కుప్పం' మండలం అద్భుత ప్రతిభ కనబరిచింది. జాతీయ స్థాయిలో మూడో స్థానాన్ని దక్కించుకున్న కుప్పం మండలానికి ఏకంగా రూ.కోటి 50 లక్షల భారీ నగదు బహుమతి లభించింది. మొత్తంగా ఈ అవార్డులు రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, స్థానిక ప్రజాప్రతినిధుల కృషికి నిదర్శనంగా నిలిచాయి.

Next Story