సంసద్ మార్చ్ వేళ కీలక పరిణామం.. దీక్ష విరమించిన అభిజీత్ దిప్కే!

by Malleboina Mahesh |

జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్షను విరమించిన కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) అధినేత అభిజీత్ దిప్కే.. కేంద్రంతో చర్చల నేపథ్యంలో నిర్ణయం!

సంసద్ మార్చ్ వేళ కీలక పరిణామం.. దీక్ష విరమించిన అభిజీత్ దిప్కే!
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ (NEET) పరీక్షల అక్రమాలకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్న కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దిప్కే తన నిరాహార దీక్షను విరమించారు. నీట్ పేపర్ లీకేజీ పై కేంద్ర ప్రభుత్వం జవాబుదారీతనం వహించాలని గత 20 రోజులకు పైగా నిరాహార దీక్ష చేసిన ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను పోలీసులు బలవంతంగా సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. ఈ పోలీస్ చర్యను నిరసిస్తూ, విద్యార్థుల గళాన్ని నొక్కేయవద్దంటూ శనివారం నుంచే జంతర్ మంతర్ వేదికగా అభిజీత్ దిప్కే ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. తాజాగా సోమవారం ఉదయం నిమ్మరసం తాగి ఆయన తన దీక్షను ముగించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

కేంద్ర ప్రభుత్వం నుండి చర్చల ప్రతిపాదనలు వచ్చినట్లు తెలుపుతూ, తదుపరి చర్చల ప్రక్రియకు మార్గం సుగమం చేసేందుకే ఆయన తన దీక్షను తాత్కాలికంగా విరమించినట్లు సీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలవడానికి బయలుదేరినట్లు ప్రకటించారు. అయితే, సీజేపీతో ఎలాంటి చర్చలకూ తాము పిలవలేదని జేపీ నడ్డా కార్యాలయం ఈ ప్రకటనను వెంటనే ఖండించింది. ఈ చర్చల అంశంపై అటు కేంద్ర ప్రభుత్వం మరియు ఇటు సీజేపీ మధ్య పరస్పర భిన్న ప్రకటనల నాటకం నడుస్తుండటంతో జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది.

Next Story