- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హన్మకొండ జిల్లాలో పంట అవశేషాల కాల్చివేత పై సంపూర్ణ నిషేధం
హన్మకొండ జిల్లాలో పంట అవశేషాలను కాల్చడం వల్ల వాయు కాలుష్యం పెరగడంతో పాటు పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుదని, నేల సారవంతత తగ్గిపోతుందని జిల్లా కలెక్టర్ చాహత్ బజపాయ్ అన్నారు.

దిశ, వరంగల్ బ్యూరో : హన్మకొండ జిల్లాలో పంట అవశేషాలను కాల్చడం వల్ల వాయు కాలుష్యం పెరగడంతో పాటు పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుదని, నేల సారవంతత తగ్గిపోతుందని జిల్లా కలెక్టర్ చాహత్ బజపాయ్ అన్నారు. ఈ కాల్చివేతల వల్ల ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా పంట వ్యర్థాల కాల్చివేతను తక్షణమే నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. వ్యవసాయ పంటల కోత అనంతరం పొలాల్లో మిగిలిపోయే పంట అవశేషాలను తగులబెట్టడం వల్ల హానికర వాయువులు వెలువడి వాతావరణ కాలుష్యం పెరుగుతుందన్నారు. ప్రజల ఆరోగ్యం, మానవ జీవనం, రహదారి భద్రత, పర్యావరణం పై ప్రతికూల ప్రభావం పడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. భూమిలోని సేంద్రియ పదార్థాలు, ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశించి భూసారం క్షీణిస్తుందని తెలిపారు.
ప్రజాభద్రత, పర్యావరణ పరిరక్షణ, ప్రజా శాంతిభద్రతల దృష్ట్యా భారతీయ నాగరిక్ సురక్షా సంహిత-2023 సెక్షన్ 163 కింద సంక్రమించిన అధికారాలను వినియోగిస్తూ జిల్లాలోని అన్ని గ్రామాలు, వ్యవసాయ భూములు, పొలాల్లో పంట అవశేషాల కాల్చివేతను తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు నిషేధిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారి పై భారతీయ న్యాయ సంహిత 2023 సెక్షన్ 223 ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉల్లంఘన వల్ల ప్రజలకు ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు లేదా మానవ ప్రాణాలకు ప్రమాదం కలిగితే జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
జిల్లాలోని తహశీల్దార్లు, ఎంపీడీఓలు, వ్యవసాయ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, పోలీస్ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, పంట కోతల సమయంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, కాలుష్య నియంత్రణ శాఖలు సమన్వయంతో పనిచేసి ఉత్తర్వులను కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు. "పంట అవశేషాలను కాల్చడం అంటే భూమాతను, పర్యావరణాన్ని, మన భవిష్యత్తును కాల్చినట్టే. రైతులు ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు. ప్రతి గ్రామం కాలుష్య రహితంగా, ప్రతి పొలం సారవంతంగా ఉండేలా అందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.






