- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షబ్బీర్ అలీ పై కామారెడ్డి కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
కామారెడ్డి కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ తగాదాలకు ఆజ్యం పోస్తున్న మాజీ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ వ్యవహార శైలీపై టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వర్గం ఆధ్వర్యంలో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.

దిశ, కామారెడ్డి : కామారెడ్డి కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ తగాదాలకు ఆజ్యం పోస్తున్న మాజీ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ వ్యవహార శైలీపై టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వర్గం ఆధ్వర్యంలో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి పీసీసీ అధ్యక్షులు, నేటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోటీ చేసిన సమయంలో షబ్బీర్ అలీ వర్గం పని చేయని కారణంగా రేవంత్ రెడ్డి ఓటమి పాలయ్యారు. షబ్బీర్ అలీ కామారెడ్డి బదులుగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేయగా.. షబ్బీర్ అలీ అనుచరులు మాత్రం కామారెడ్డి నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ గెలుపు కోసం పని చేయని కారణంగా రేవంత్ రెడ్డి ఓటమి చెందారని బహిరంగ సత్యం. ఆ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి ఇన్ చార్జిగా వ్యవహరించి ప్రచారం నిర్వహిస్తే.. షబ్బీర్ అలీ అనుచరులు మాత్రం పని చేయకుండా నిరాకరణ చేశారని పేర్కొన్నారు.
గత అసెంబ్లీ ఎన్నిక్లలో రేవంత్ రెడ్డి గెలుపు కోసం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, అప్పటి మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందూ ప్రియా ఆధ్వర్యంలో అహర్నిశలు శ్రమించడం జరిగిందన్నారు. షబ్బీర్ అలీ 1989 ఎన్నికల నుంచి పోటీ చేస్తూనే వస్తున్నారని, ఇప్పటి వరకు మూడు నియోజకవర్గాల పరిధిలో ముఖ్యంగా కామారెడ్డి, (ఎల్లారెడ్డి ఉప ఎన్నిక), నిజామాబాద్ అర్బన్ నుంచి మొత్తం తొమ్మిది సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయగా, కేవలం రెండు సార్లు మాత్రమే (1989, 2004) గెలుపొందారన్నారు. ఆ తర్వాత ఏ ఎన్నిక్లల్లో విజయం సాధించలేదన్నారు. ద్వితీయ శ్రేణి నేతలకు మాత్రం అవకాశం కల్పించకుండా నిర్లక్ష్యం చేశారనేది బహిరంగ సత్యం అన్నారు. కొత్త నేతలను ఎదగనీయకుండా, యూత్ కు అవకాశం కల్పించకుండా, పాత నేతలకు, సీనియర్స్ కు అవకాశం కల్పించక పోవడంతో కాంగ్రెస్ పార్టీని వీడాల్సిన దుస్థితి కామారెడ్డి నియోజకవర్గంలో ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంతో మంది సీనియర్స్, నియోజకవర్గ స్థాయి నాయకులు పార్టీ నుంచి పొమ్మనలేక పోగొట్టిన చరిత్ర షబ్బీర్ అలీ కుటుంబంపై ఉందన్నారు. ఒక్కసారి నియోజకవర్గంలో అధిష్టానం సర్వే చేసి అన్ని విషయాలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ తమ్ముడు మహ్మద్ నహీం అరాచకాలు అంతా ఇంతా కాదు. ఏ అధికారికి పోస్టింగ్ కావాలన్నా.. ట్రాన్స్ ఫర్ కావాలన్నా ఆయన చెప్పిందే వేదం అన్నారు. ఇక్కడికి ఏ శాఖలో అయినా బదిలీపై రావాలన్నా షబ్బీర్ అలీ సోదరుడు నహీంను ముందుగా సంప్రదించి అమ్యామ్యాలు సమర్పించనిదే ఏ పనీ కాదన్నారు. ఎస్సై నుంచి మొదలుకొని డిఎస్పీ, తహసీల్దార్, ఎంపీడివో, డివిజన్, జిల్లా స్థాయి అధికారులు ఎవరైనా మండల స్థాయి అధికారుల నియామకంలో షబ్బీర్ అలీ కుటుంబ సభ్యులను కలవాల్సిన పరిస్థితి ఇక్కడ తయారైందన్నారు. 2026 మున్సిపల్ ఎన్నికల్లో కామారెడ్డిలో 49 వార్డులు ఉండగా షబ్బీర్ అలీ తరుపున 40వార్డులకు టికెట్స్ ఇవ్వగా వీరిలో 16మంది గెలుపొందారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వర్గంకు 9 సీట్లు ఇవ్వగా ముగ్గురు గెలుపొందారు.
మిగిలిన ఆరుగురు అభ్యర్థులను షబ్బీర్ అలీ, ఆయన సోదరుడు నహీం, కుమారుడు ఇలియాస్, కుటుంబసభ్యులు మహ్మద్ ఇసాక్ షేర్, సోహెల్ లు ఓడించారని కామారెడ్డిలో మాత్రం కోడైకూస్తుందన్నారు. ఇక్కడ మరో వర్గం ఎదగకుండా ఉండేందుకు కుట్రలకు పాల్పడుతూ కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణం అయ్యారని పేర్కొన్నారు. ముఖ్యంగా మూడు చోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిపించి కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించడంలో కీలక పాత్ర పోషించిన ఘటనలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీలో అర్హులైన చైర్మన్ అభ్యర్థులు ఉన్నపటికీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచిన అభ్యర్థికి కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ స్థానం కట్టబెట్టిన ఘనమైన చరిత్ర షబ్బీర్ అలీకి దక్కిందన్నారు. కామారెడ్డి 38వ వార్డ్ నుంచి ఇండిపెండెంట్ గా విజయం సాధించిన ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ వద్ద 4కోట్ల డీల్ చేసుకొని ఛైర్పర్సన్ స్థానం ఇప్పించారనే విమర్శలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు ఉన్నప్పటికీ డబ్బుల కోసమే ఇండిపెండెంట్ అభ్యర్థికి చైర్మన్ స్థానం కల్పించిన చరిత్ర సీనియర్ నేత షబ్బీర్ అలీకే దక్కిందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ఓడించిన నేతలతో, కొండల్ రెడ్డిపై దాడికి యత్నించిన నేతలతో షబ్బీర్ అలీ వర్గం పని చేస్తుందన్నారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి జీసిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సామజిక కార్యక్రమాలు ముమ్మరంగా చేపడుతున్నారన్నారు. తాము కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే సీనియర్ నేత షబ్బీర్ అలీ మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై అవకాశం వచ్చిన ప్రతిసారి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. కామారెడ్డి పట్టణ పరిధితో పాటు నియోజకవర్గంలో ఆయా మండలాల పరిధిలో పార్టీ పటిష్టతకు కృషి చేస్తుంటే మాత్రం మమ్మల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఫిర్యాదు లో పేర్కొన్నారు. తమ అనుచరులపై, తమపై పోలీస్ అక్రమ కేసులు పెట్టడం, బెదిరింపులకు పాల్పడటం చేస్తున్నారన్నారు. పార్టీలో యువతను, మహిళలను చేర్చి పని చేస్తుంటే షబ్బీర్ అలీ ఆయన తమ్ముడు నహీంలు మాత్రం భయందోళనకు గురి చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు.
గత కొన్ని నెలలుగా కామారెడ్డి నియోజకవర్గ పరిధిలో ఇప్పటి వరకు నిరుపేదలకు పుస్తె మట్టెల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశం చేసే పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం, వంట సామాగ్రి పంపిణీ, వైద్య సహాయం చేస్తు పార్టీ పటిష్టతకు కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సలహాలు, సూచనలతో కామారెడ్డి నియోజకవర్గంలో విరివిగా, ముమ్మరంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. గత 40 ఏళ్లుగా కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లేదని, షబ్బీర్ అలీ నివాసంలో మాత్రమే కొనసాగిస్తున్నారన్నారు. అయితే ఇటీవలే కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కార్యాలయాన్ని ఎల్లారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేలు మదన్ మోహన్, లక్ష్మి కాంత్ రావ్ సహకారంతో నూతన జిల్లా కార్యాలయం ఏర్పాటు చేయించడం జరిగిందన్నారు. అప్పటి నుంచి మాపై కక్ష కట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. కామారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో యువత కోసం జాబ్ మేళా నిర్వహించగా 3500 నిరుద్యోగ యువత హాజరు కాగా, వీరిలో 500మందికి వివిధ ప్రయివేట్ కంపెనీలలో ఉద్యోగాలు రావడం జరిగిందన్నారు. దీంతో ఓర్వలేక తమపై, తమ టీం పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తుంటే షబ్బీర్ అలీతో పాటు వారి తమ్ముడు నహీం, కుమారుడు ఇలియాస్, కుటుంబ సభ్యులు మహ్మద్ ఇసాక్ షేర్, సోహెల్ తదితరులు పార్టీ కార్యక్రమాల్లో జోక్యం చేసుకుంటారన్నారు.
కామారెడ్డి కాంగ్రెస్ పార్టీలో కుటుంబ పాలనలాగా కొనసాగిస్తూ పార్టీని తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఎదగకుండా ఉన్నారన్నారు. ఇప్పటి వరకు 40ఏళ్లుగా ఎవరి నియోజకవర్గం దాటకుండా తమ అధీనంలో ఉండే విధంగా తయారు చేసుకున్నారన్నారు. ఒకసారి కామారెడ్డి కాంగ్రెస్ నియోజకవర్గంలో అధిష్టానం దృష్టి పెట్టి చక్కదిద్దాలని కార్యకర్తలం కోరుతున్నామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసేలా కలిసి కట్టుగా కృషి చేస్తామని, అధిష్టానం, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ లు ప్రత్యేక ఫోకస్ పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో కామారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మామిళ్ళ అంజన్న, కామారెడ్డి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియా, డీడీసీ ఉపాధ్యక్షులు నిమ్మ విజయకుమార్ రెడ్డి, పంపరి లక్ష్మణ్, సబ్బని హరికృష్ణ, మున్సిపల్ కౌన్సిలర్లు గడ్డమీది మహేష్, తాటి లావణ్య ప్రసాద్, క్రెడా అధ్యక్షులు నర్సాగౌడ్, మాజీ కౌన్సిలర్లు సలీం, రంగ రమేష్ గౌడ్ మాధవి, చాట్ల వంశీ దీక్షిత, పిడుగు మమత సాయిబాబా, శంకర్రావు, జమీల్, చింతల రవీందర్,మామిళ్ళ రమేష్, కామారెడ్డి సేవాదళ్ యూత్ అధ్యక్షులు నర్సుల మహేష్ శిరీష, గంగుల్ రెడ్డి, సుదర్శన్, ధర్మ గౌడ్, బండారి శ్రీకాంత్, శేఖర్, బల్ల శ్రీనివాస్, అరవింద్, వేణు,కోటేశ్వర్, అరుణ్, ఆబిద్, మున్ను, కర్ణాకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రాహుల్, పండు శ్రీకాంత్, శశి, షాహిద్ ఉన్నారు.






