కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం : మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

by Nallavelli.Anjaneyulu |

కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో విఫలమైందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తీవ్రంగా విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం  : మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
X

దిశ, కామారెడ్డి టౌన్ : కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో విఫలమైందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తీవ్రంగా విమర్శించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వెలమ ఫంక్షన్ హాలులో గురువారం జరిగిన బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, సర్ పై సన్నాహక సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ విజిగౌడ్, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జాజాల సురేందర్, హన్మంత్ షిండే తదితరులు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి కనిపిస్తే టీవీలు కట్టేసే పరిస్థితి ఉందని ప్రశాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజల దృష్టిలో అబద్ధాల కోరుగా, దుర్మార్గుడిగా, చేతకాని సీఎంగా, మోసకారిగా రేవంత్ రెడ్డి మిగిలిపోయారని ఆరోపించారు.


కేసీఆర్ హయాంలో రైతులను కడుపులో పెట్టుకుని చూసుకున్నారని, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిందని ఆయన అన్నారు. ధాన్యం కొనుగోలు, యూరియా సరఫరా కేసీఆర్ కాలంలో ఎలా ఉండేదో, ఇప్పుడెలా ఉందో ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు. గతంలో 24 గంటల కరెంట్ ఇప్పుడు 11 గంటలకే పరిమితమైందని, తెలంగాణలో మళ్లీ మోటార్లు కాలిపోవడం మొదలైందని విమర్శించారు. రాష్ట్రంపై సీఎం, మంత్రులు గద్దల్లా పడి వేలకోట్ల భూములు దోచుకుంటున్నారని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. ఫార్మాసిటీకి సేకరించిన 14 ఎకరాల భూమిని ఫోర్త్ సిటీ పేరుతో దోపిడీకి ప్రయత్నిస్తున్నారని, సివిల్ సప్లై, ఎక్సైజ్ శాఖలో రూ.6 వేల కోట్ల కుంభకోణం జరిగిందని, వేణుగోపాలస్వామి ఆలయానికి సంబంధించిన 116 ఎకరాలపై కన్నేశారని మండిపడ్డారు. రైతు డిస్కం పేరుతో దోపిడీకి కుట్ర జరుగుతోందని, ఆదాయం వచ్చే డిస్కంలను ప్రైవేట్‌కు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు నయాపైసా ఇవ్వడం లేదని, పైపెచ్చు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతోందని విమర్శించారు. 30 నెలలుగా కాంగ్రెస్ ప్రజలను వంచిస్తోందని, దేవుళ్లపై ఒట్లు వేసి అమలు చేయలేని దౌర్భాగ్యపు సీఎం తెలంగాణకు దురదృష్టమని గంప గోవర్ధన్ అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తరలించలేని స్థితిలో రైతులు కన్నీళ్లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఓటమి కామారెడ్డికి తీరని మచ్చ అని, ఆ మచ్చ తొలగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గంగాధర్ గౌడ్, దేపేందర్ రాజు, హన్మంత్ షిండే, సురేందర్ రెడ్డి, ఎంకే ముజీబ్, బాజిరెడ్డి గోవర్ధన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Next Story