JEE లో డేటా లీక్‌.. కాక్రోచ్‌ జనతా పార్టీ విమర్శలు

by Muthe.Rajitha |

దేశంలో ఓవైపు నీట్ లీకేజి, SSC GD పరీక్ష లీకేజిలతో దుమారం రేగుతుంటే.. మరో వివాదం తెర మీదకి రావడం సంచలనం సృష్టిస్తోంది.

JEE లో డేటా లీక్‌.. కాక్రోచ్‌ జనతా పార్టీ విమర్శలు
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో ఓవైపు నీట్ లీకేజి, SSC GD పరీక్ష లీకేజిలతో దుమారం రేగుతుంటే.. మరో వివాదం తెర మీదకి రావడం సంచలనం సృష్టిస్తోంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 ఫలితాల పోర్టల్‌లో తలెత్తిన భద్రతా లోపం తీవ్రమైన చర్చకు దారితీసింది. దుబాయ్‌కి చెందిన 16 ఏళ్ల యువ సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ స్కాలర్ రైలన్ అనిల్, ఈ ఏడాది జేఈఈ పరీక్షలను నిర్వహించిన ఐఐటీ రూర్కీకి అనుసంధానించబడిన పబ్లిక్ క్లౌడ్ స్టోరేజ్ ఎండ్‌పాయింట్‌లో ఒక పెద్ద లోపాన్ని (Misconfiguration) గుర్తించి సామాజిక మాధ్యమం 'X' లో ఆధారాలతో సహా బహిర్గతం చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కేవలం ఒక చిన్న సాంకేతిక లోపం కారణంగా ఎలాంటి లాగిన్ ఐడీ లేదా పాస్‌వర్డ్ వంటి అథెంటికేషన్ పరిమితులు లేకుండానే దాదాపు 1.79 లక్షల మంది అభ్యర్థుల ఫలితాల రికార్డులు, మార్కులు, ర్యాంకులు, పుట్టిన తేదీలు, మొబైల్ నంబర్లతో కూడిన సుమారు 1.87 లక్షల అడ్మిట్ కార్డ్ పిడిఎఫ్‌లు బహిర్గతమవడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

ఈ సమాచారం వెలుగులోకి వచ్చిన వెంటనే ఐఐటీ రూర్కీ యాజమాన్యం త్వరితగతిన స్పందించి ఆ క్లౌడ్ లీకేజీ సమస్యను పూర్తిగా పరిష్కరించినట్లు ప్రకటించింది. అంతేకాకుండా, సదరు డేటా కేవలం 'రీడ్-ఓన్లీ' మోడ్‌లో మాత్రమే లభ్యమైందని, ఫలితాల రికార్డులలో ఎలాంటి మార్పులు గాని ట్యాంపరింగ్ గాని జరగలేదని స్పష్టం చేస్తూ విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది. అయితే, విద్యార్థుల డేటా సేఫ్టీకి సంబంధించిన ఈ సున్నితమైన అంశంపై విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుండి, రాజకీయ వర్గాల నుండి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నాయకులు ఢిల్లీ వేదికగా విలేకరుల సమావేశం నిర్వహించి కేంద్ర ప్రభుత్వంపై, విద్యాశాఖపై విమర్శల వర్షం కురిపించారు. దేశంలో పదేపదే విద్యా రంగ పరీక్షల పోర్టల్‌లు సైబర్ దాడులకు, భద్రతా లోపాలకు గురవుతున్నందున కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తక్షణమే మంత్రివర్గం నుండి తొలగించాలని వారు డిమాండ్ చేశారు.

ఇటీవల సీబీఎస్‌ఈ (CBSE) ఆన్‌స్క్రీన్ మార్కింగ్ వివాదాలు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించిన నీట్-యూజీ పరీక్షల సర్వర్లలో తలెత్తిన తీవ్రమైన లోపాలను ఉదహరిస్తూ.. ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఐటీ వ్యవస్థలో కూడా ఇలాంటి భద్రతా లోపం బయటపడటం కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణా లోపానికి పరాకాష్ట అని మండిపడ్డారు. ఐఐటీ రూర్కీ ఈ లోపాన్ని వెంటనే సరిచేసినప్పటికీ, దేశంలో భవిష్యత్తును నిర్ణయించే కీలక పరీక్షల భద్రతపై, విద్యార్థుల వ్యక్తిగత సమాచార రక్షణపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళనలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

Next Story