సంతోష్ నగర్‌లో ఘరాణా మోసం...

by Batti.Sumithra |

పైసాపైసా కూడబెట్టి పేదలు ప్లాట్లు కొంటే, ఓ రియల్టర్ పట్టాలేకుండా పారిపోయిన ఘటన జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

సంతోష్ నగర్‌లో ఘరాణా మోసం...
X

దిశ, జవహర్‌నగర్ : పైసాపైసా కూడబెట్టి పేదలు ప్లాట్లు కొంటే, ఓ రియల్టర్ పట్టాలేకుండా పారిపోయిన ఘటన జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సంతోష్ నగర్‌లో ఆదివారం బాధితులు మీడియాతో మాట్లాడుతూ జవహర్‌నగర్ సంతోష్ నగర్‌లో నివసించే కనిగంటి వెంకటేష్ (42) అమాయక పేదలను ఆసరాగా చేసుకుని అక్రమంగా ప్లాట్లను అమ్ముతూ సొమ్ము చేసుకున్నాడని తెలిపారు. అమ్మిన ప్లాట్లను చూపకుండా మరో చోటుకు మారుస్తూ కాలం వెళ్లదీస్తూ వచ్చాడన్నారు. ప్లాట్లు చూపాలని బాధితులు నిలదీయడంతో ఇస్తామంటూ నమ్మబలుకుతూ పేదలను నిండా ముంచాడని ఆరోపించారు.

సుమారు రూ. 2 కోట్ల మేరకు బాధితుల నుంచి వసూలు చేసి, రాత్రికి రాత్రే కుటుంబ సభ్యులతో సహా పారిపోయాడని కన్నీటి పర్యంతమయ్యారు. పోలీస్ స్టేషన్ సమీపంలోని చెన్నాపూర్, మల్కారం ప్రాంతాల్లో అక్రమ లేఅవుట్లు వేస్తూ పేదలకు ప్లాట్లు అమ్మి భారీ మోసానికి తెరలేపాడని తెలిపారు. ఒక్కొక్కరి వద్ద రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు వసూలు చేసి నోటరీలు చేశాడని పేర్కొన్నారు. అదను చూసిన వెంకటేష్ శనివారం రాత్రి రాత్రికిరాత్రే గుర్తు తెలియని ప్రాంతానికి మకాం మార్చాడని తెలిపారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బాధితులు పల్లపు ప్రశాంత్, రేణుక, మంగమ్మ, భాగ్యలక్ష్మి, ప్రవల్లిక, అండాలు, స్వాతి, లావణ్య, సత్తమ్మ, రేణుక, పద్మ, నవనీత, సులోచన పాల్గొన్నారు.

Next Story