- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏకరూప దుస్తులు ఏవి..?
రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు పాఠశాలలు ప్రారంభానికి ముందే నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో పాటు ఏకరూప దుస్తులను కూడా అందజేస్తామని ప్రకటించారు.

దిశ, ఝరాసంగం : రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు పాఠశాలలు ప్రారంభానికి ముందే నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో పాటు ఏకరూప దుస్తులను కూడా అందజేస్తామని ప్రకటించారు. అయితే పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు గడిచినా ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందలేదు. దీంతో విద్యార్థులు పాత దుస్తులతోనే పాఠశాలలకు హాజరవుతూ విద్యను అభ్యసిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, ఆదర్శ పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం తదితర విద్యాసంస్థల్లో సుమారు 4,500 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరానికి ఏకరూప దుస్తుల రంగులను మార్చినప్పటికీ, ఇప్పటి వరకు వాటిని విద్యార్థులకు పంపిణీ చేయలేదు.
దీంతో తల్లిదండ్రులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం 'దిశ' ఝరాసంగం ఆదర్శ పాఠశాలను సందర్శించి పరిశీలించగా విద్యార్థులు వివిధ రంగుల దుస్తుల్లో కనిపించారు. కొంతమంది విద్యార్థులు గత విద్యా సంవత్సరంలో ఇచ్చిన పాత ఏకరూప దుస్తులతోనే పాఠశాలకు హాజరయ్యారు. ఈ విషయమై ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మిని వివరణ కోరగా, ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఏకరూప దుస్తులు అందలేదని, దీంతో విద్యార్థులు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి విద్యార్థులు ఎదుర్కొంటున్న ఏకరూప దుస్తుల సమస్యను వెంటనే పరిష్కరించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని, విద్యాశాఖ అధికారులను విజ్ఞప్తి చేశారు.
దుస్తులు ఇంకా రాలేదు : ఎంఈఓ శ్రీనివాస్, ఝరాసంగం
ఝరాసంగం మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 4,500 మంది విద్యార్థులు చదువుతున్నారు. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఏకరూప దుస్తులు ఇప్పటి వరకు అందలేదు. దుస్తుల రంగు మారిన విషయం తమకు తెలియదని ఎంఈఓ శ్రీనివాస్ తెలిపారు. వస్త్రం వచ్చిన తర్వాత కుట్టించే బాధ్యతను ఐకేపీ అధికారులు చేపట్టిన అనంతరం పాఠశాలలకు పంపిణీ చేస్తారని ఆయన వివరించారు.






