- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ నిధులు సారడు.. ఖర్చు బారెడు
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం ప్రస్తుతం మిడ్ డే మీల్స్ కార్మికులకు భారంగా మారింది.

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: ‘విద్యార్థుల కడుపు నింపే చేతులు... నేడు అప్పులు, నష్టాలు, ఆవేదనలతో నిండిపోతున్నాయి. ప్రభుత్వం ఆ చేతులకు భరోసా కల్పించాలని వేడుకుంటున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం ప్రస్తుతం మిడ్ డే మీల్స్ కార్మికులకు భారంగా మారింది. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, గుడ్ల రేట్లు, కూరగాయల ఖర్చులు, తక్కువ వేతనాలు, నాణ్యతలేని బియ్యం... ఇలా ఒకటి కాదు అనేక సమస్యలతో కార్మికులు సతమతమవుతున్నారు. ప్రభుత్వ నిధులు సరిపోకపోయినా పిల్లలకు భోజనం ఆగిపోకూడదనే ఉద్దేశంతో సొంత డబ్బులు వెచ్చిస్తూ పథకాన్ని కొనసాగిస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలంటూ ప్రజావాణిలో వినతులు వెలువెత్తుతున్నాయి.
కార్మికులకు భారంగా మధ్యాహ్న భోజన పథకం..
జిల్లా వ్యాప్తంగా 500కు పైచిలుకు ప్రైమరీ పాఠశాలలు ఉండగా, 100కు పైగా సెకండరీ పాఠశాలలు ఉన్నాయి. మొత్తం పాఠశాలలు కలుపుకొని 850 కి పైచిలుకు మంది మధ్యాహ్న భోజన కార్మికులుగా పనిచేస్తున్నారు. కాగా మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ప్రైమరీ పాఠశాలల్లో చదివే ఒక్కొక్క విద్యార్థికి ప్రభుత్వం రూ.5.18 పైసలు ఖర్చు చేస్తుండగా, సెకండరీ పాఠశాలలో ఒక్కో విద్యార్థికి రూ.8.17 పైసలు ఖర్చు చేస్తుంది. అయితే ఈ పథకంలో పనిచేసే కార్మికులకు ఒక్కొక్కరికి ప్రభుత్వం రూ.3 వేల జీతం మాత్రమే ఇస్తుంది.. దీంతో మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు భారంగా మారుతుంది.
ప్రభుత్వ నిధులతో అదనపు భారం..
ప్రస్తుతం మార్కెట్‌లో ఒక్కో గుడ్డు ధర రూ.8 నుంచి రూ.8.50 వరకు పలుకుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం ఒక్కో గుడ్డుకు రూ.6 మాత్రమే చెల్లిస్తోంది. దీంతో ఒక్కో గుడ్డు పై రూ.2.50 వరకు అదనపు భారం కార్మికులపైనే పడుతోంది. ప్రతి రోజు వందలాది గుడ్లు పంపిణీ చేసే పాఠశాలల్లో నెలాఖరుకు వేల రూపాయల నష్టం వస్తోందని వారు చెబుతున్నారు. గతంలో అదనంగా భరించిన గుడ్ల ఖర్చు బకాయిలు కూడా ఇప్పటికీ చెల్లించలేదని వాపోతున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం రెండు రకాల కూరలు అందించాల్సి ఉన్నా, ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులతో అది సాధ్యం కావడం లేదని కార్మికులు చెబుతున్నారు. కూరగాయలు, పప్పులు, నూనె, మసాలా దినుసుల ధరలు పెరిగిపోవడంతో అన్ని కూరగాయలను కలిపి ఒకే కూర చేసి వడ్డించే పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. నాణ్యతను కాపాడాలా, ఖర్చును తగ్గించాలా అనే సందిగ్ధంలో పడుతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రూ.10 వేల కనీస వేతనం ఊసే లేదు..
రోజంతా వంట చేసి, పాత్రలు శుభ్రం చేసి, పాఠశాల పరిశుభ్రతలో భాగస్వాములవుతున్నాం. తమకు ప్రభుత్వం ప్రకటించిన కనీసం రూ.10 వేల వేతనం కూడా అందడం ఇంకా అమలు కాలేదు. చాలీచాలని జీతాలతో కుటుంబం నెట్టుకు రావడమే కష్టంగా మారుతుండగా, పాఠశాలలో పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించడం మరో భారం అవుతుంది. ప్రభుత్వం స్పందించి వెంటనే కనీస వేతనం కింద రూ.10 వేలు మధ్యాహ్న భోజన కార్మికుల అందించాలి.-మధ్యాహ్న భోజన వంట కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి గొట్టే సంతోష
బియ్యంలా గుడ్లు సరఫరా చేయాలి
ఒక్కో విద్యార్థి పై ప్రభుత్వం చేస్తున్న ఖర్చు సరిపోక అదనపు భారం పడుతుంది. అప్పులు చేసి మరి విద్యార్థులకు అన్నం పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. బియ్యాన్ని ప్రభుత్వం నేరుగా సరఫరా చేస్తున్నట్లు గుడ్లను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి పాఠశాలలకు అందించాలి. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు స్పందించి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలి.-సంఘం జిల్లా అధ్యక్షురాలు గొట్టే దేవేంద్ర
- Tags
- Mid-day meals






