బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం.. ‘ఏఐ’ మంత్రిగా భారతీయుడు

by Kema Shiva Kumar |

బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం.. ‘ఏఐ’ మంత్రిగా భారతీయుడు
X

దిశ, వెబ్‌డెస్క్: బ్రిటన్ (Britain) రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అక్కడి కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా, భారత సంతతికి చెందిన లేబర్ పార్టీ ఎంపీ కనిష్క నారాయణ్ (Kanishka Narayan) ఆ దేశ తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆన్‌లైన్ సేఫ్టీ (ఆన్‌లైన్ రక్షణ) మంత్రిగా ఎంపికయ్యారు. ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా అనంతరం యాండీ బర్న్‌హామ్ బ్రిటన్ నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఏర్పాటు చేసిన కొత్త కేబినెట్‌లో కనిష్క నారాయణ్‌కు కీలక బాధ్యతలను అప్పగించారు. వేల్స్‌లోని వేల్ ఆఫ్ గ్లామోర్గన్ (Vale of Glamorgan) నియోజకవర్గం నుంచి 2024 జూలైలో ఎంపీగా గెలుపొందిన కనిష్క.. వేల్స్ ప్రాంతం చిడి బ్రిటన్ పార్లమెంట్‌కు ఎన్నికైన తొలి మైనారిటీ ఎంపీగా చరిత్ర సృష్టించారు. గతంలో ఆయన పర్యావరణ, ఆహార, గ్రామీణ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పార్లమెంటరీ ప్రైవేటు కార్యదర్శిగా కూడా సేవలందించారు.

కాగా, కనిష్క నారాయణ్ భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలో జన్మించారు. ఆయనకు 12 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు వారి కుటుంబం బ్రిటన్‌లోని కార్డిఫ్‌కు వలస వెళ్లింది. కార్డిఫ్‌లోని కథేస్ హైస్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసిన ఆయన, ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి పట్టా పొందారు. ఆ తర్వాత అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి MBA పూర్తి చేశారు. అదేవిధంగా అటైన్ వేల్స్ (Attain Wales) అనే స్వచ్ఛంద సంస్థ సహ వ్యవస్థాపకుడిగా కూడా ఆయన సేవలు అందించారు.

Next Story