- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతు పక్షపాతిగా పాలన సాగిస్తోందని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు.

దిశ, వలిగొండ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతు పక్షపాతిగా పాలన సాగిస్తోందని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం మూసీ నదిపై పోచంపల్లి మండలం ధర్మారెడ్డిపల్లి గ్రామం వద్ద మరమ్మతులు చేపట్టిన ధర్మారెడ్డిపల్లి కాలువలో ఏర్పాటు చేసిన క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. భువనగిరి, నకిరేకల్ నియోజకవర్గాల రైతులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న శుభ ఘడియ ఆవిష్కృతమైందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. సుమారు రూ.125 కోట్ల వ్యయంతో చేపట్టిన ధర్మారెడ్డిపల్లి కాలువ నిర్మాణ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 16 నెలల్లోనే సగానికి పైగా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించే స్థాయికి తీసుకువచ్చిందని తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టుకు తమ ప్రభుత్వం వేగం తీసుకొచ్చి రైతుల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిందన్నారు.
ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరులోగా కాలువ నిర్మాణ పనులను పూర్తిచేసి రైతులకు శాశ్వతంగా సాగునీరు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. కాలువ పూర్తయిన అనంతరం వేలాది ఎకరాలకు సాగునీరు అందడంతో వ్యవసాయ ఉత్పత్తి పెరగడమే కాకుండా రైతుల ఆర్థికాభివృద్ధికి కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ధర్మారెడ్డిపల్లి కాలువలో నీటి విడుదలతో ఈ ప్రాంత రైతుల చిరకాల నిరీక్షణకు తెరపడిందని అన్నారు. కాలువ పూర్తయిన తర్వాత ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బత్తిని సహదేవ్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు పోలేపాక జానకిరాములు, మండల, గ్రామాల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ఇరిగేషన్ ఈఈ, డీఈ, అధికారులు, రైతులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






