- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
7,400 పోలీసు పోస్టుల భర్తీకి షెడ్యూల్ ఇవ్వండి: తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
తెలంగాణలో పోలీసు పోస్టుల భర్తీపై పూర్తి షెడ్యూల్‌ను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డును హైకోర్టు ఆదేశించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర పోలీసు శాఖలో ఇటీవల ప్రభుత్వం ఆమోదించిన సుమారు 7,400 ఖాళీ పోస్టుల నియామక ప్రక్రియకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని తెలంగాణ హైకోర్టు, రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డును ఆదేశించింది. నియామక ప్రక్రియ ఏ దశలో ఉంది, ఎప్పటిలోగా పూర్తి చేస్తారు అనే వివరాలను నాలుగు వారాల్లోగా నివేదించాలని పేర్కొంటూ తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. పోలీసు శాఖలో వివిధ హోదాల్లో మంజూరైన భారీ సంఖ్యలోని ఖాళీలను భర్తీ చేయడం లేదని సవాల్ చేస్తూ ‘హెల్ప్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్’ చైర్మన్ కేతినేడి అఖిల్ శ్రీగురు తేజ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL)పై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
5 వేల పోస్టుల ప్రక్రియ ప్రారంభమైంది: స్పెషల్ జీపీ
విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ రాహుల్ వాదనలు వినిపిస్తూ.. 5,000 పోలీసు పోస్టుల నియామక ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, దీనికి సంబంధించి రిక్రూట్‌మెంట్ బోర్డు పత్రికా ప్రకటన కూడా విడుదల చేసిందని ధర్మాసనానికి వివరించారు. అయితే పిటిషనర్ తరఫు న్యాయవాది ఈ వాదనలను వ్యతిరేకించారు. గత విచారణలో 7,000కు పైగా పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వం కోర్టుకు హామీ ఇచ్చిందని, కానీ ఇప్పుడు కేవలం 5,000 పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని వాదించారు. చివరిసారిగా 2022లో నియామకాలు జరిగాయని, నాలుగేళ్లు గడిచినా తక్కువ పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
సివిల్ డిఫెన్స్ విభాగాల్లో 2,400 ఖాళీలు..
పిటిషనర్ వాదనలపై స్పెషల్ జీపీ స్పందిస్తూ.. ప్రస్తుతం ప్రకటించిన 5,000 పోస్టులు పోలీసు శాఖలోని వివిధ విభాగాలకు సంబంధించినవని స్పష్టం చేశారు. మిగిలిన సుమారు 2,400 పోస్టులు అగ్నిమాపక, విపత్తు నిర్వహణ, జైళ్ల శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వంటి సివిల్ డిఫెన్స్ విభాగాలకు చెందినవని, వాటిని కూడా భర్తీ చేసే ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. మొత్తం 7,400 పోస్టుల నియామకాలకు సంబంధించి స్పష్టమైన షెడ్యూల్‌ను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని రిక్రూట్‌మెంట్ బోర్డును ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.






