వీఐపీ భద్రతకు కోత..400 మంది సిబ్బంది వాపస్

by Ajay Maddhiboyina |

తెలంగాణ పోలీసు శాఖను మరింత సమర్థవంతంగా, కాలమాన పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్‌ భారీ కసరత్తు ప్రారంభించారు.

వీఐపీ భద్రతకు కోత..400 మంది సిబ్బంది వాపస్
X

దిశ,తెలంగాణ బ్యూరో: తెలంగాణ పోలీసు శాఖను మరింత సమర్థవంతంగా, కాలమాన పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్‌ భారీ కసరత్తు ప్రారంభించారు. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన స్టాఫ్ ఆఫీసర్ల ఉన్నత స్థాయి సమావేశంలో పోలీసు శాఖలో చేపట్టాల్సిన విధానపరమైన మార్పులు, పరిపాలనా సంస్కరణలపై ఆయన కీలక దిశానిర్దేశం చేశారు. ఎస్‌ఆర్‌సీ నివేదిక అమలుతో పాటు, శాఖలోని మానవ వనరుల వినియోగంపై డీజీపీ సుదీర్ఘంగా సమీక్షించారు.

విధుల్లోకి 400 మంది పోలీసులు... గతంలో మావోయిస్టు ముప్పు పేరుతో అవసరానికి మించి కల్పించిన భద్రతను సమీక్షించి, తక్షణమే ఉపసంహరించుకోవాలని డీజీపీ ఆదేశించారు. ఈ నిర్ణయం ద్వారా దాదాపు 400 మంది పోలీసు సిబ్బందితో పాటు, పెద్ద సంఖ్యలో బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలు తిరిగి శాఖ పరమైన విధులకు అందుబాటులోకి రానున్నాయి. శాఖలోని ప్రతి సిబ్బందిని, వాహనాన్ని శాస్త్రీయంగా ఆడిట్ చేసి, అవసరమైన చోట మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు.

ఉమ్మడి క్యాంపస్‌లో ఎలైట్ ఫోర్సులు... రాష్ట్రంలోని గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ యూనిట్ల నిర్వహణలో సమన్వయం పెంచేందుకు రెండు విభాగాలను ఒకే క్యాంపస్ నుంచి నడిపించే అంశంపై సమావేశంలో చర్చించారు. అలాగే, చిరకాలంగా పెండింగ్‌లో ఉన్న తెలంగాణ పోలీసు మాన్యువల్కు తుది రూపం ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని డీజీపీ సూచించారు. ఐపీఎస్ అధికారుల యూనిఫాంలో భాగంగా ఉన్న క్రాస్ బెల్ట్‌లు, లాఠీలు వంటి సంప్రదాయ అంశాల ప్రస్తుత ఆవశ్యకతపై అధికారుల అభిప్రాయాలను కోరారు.

కొత్త విభాగాల ఏర్పాటు.. ప్రజా భద్రతను దృష్టిలో ఉంచుకుని విజిలెన్స్‌, ఆహార కల్తీ నిరోధం, డ్రగ్ కంట్రోల్ వంటి రంగాల్లో కొత్తగా ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ట్రాఫిక్ రోడ్డు భద్రత బ్యూరో ను కూడా త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. సి.సి.టి.ఎన్.ఎస్ 3.0, టీజీ కాప్,హాక్‌ఐ 3.0 ప్రాజెక్టుల పురోగతిని డీజీపీ సమీక్షించారు. తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో వెల్లడైన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేస్తామని డీజీపీ సి.వి. ఆనంద్‌ వెల్లడించారు.

Next Story