భక్తుల రద్దీతో తిరుపతిలో ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీ రద్దు

by Ramesh Naini |

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో గురువారం దర్శనానికి సంబంధించి తిరుపతిలోని మూడు కేంద్రాల్లో బుధవారం జారీ చేయాల్సిన సమయ నిర్దేశ దర్శన టోకెన్లను టీటీడీ రద్దు చేసింది.

భక్తుల రద్దీతో తిరుపతిలో ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీ రద్దు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో గురువారం దర్శనానికి సంబంధించి తిరుపతిలోని మూడు కేంద్రాల్లో బుధవారం జారీ చేయాల్సిన సమయ నిర్దేశ (ఎస్‌ఎస్‌డీ) దర్శన టోకెన్లను టీటీడీ రద్దు చేసింది. శుక్రవారం దర్శనానికి సంబంధించిన టోకెన్లను మాత్రం గురువారం మధ్యాహ్నం నుంచి యథావిధిగా జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ కారణంగా ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీని రద్దు చేయడం వరుసగా నాలుగో వారానికి చేరుకోవడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దర్శన టోకెన్లు అందుబాటులో లేకపోవడంతో పలువురు భక్తులు నిరాశకు గురవుతున్నారు.

ఇదిలా ఉండగా, బుధవారం దర్శనాల కోసం మంగళవారం వేకువజామున 5 గంటలకు 10 వేల ఎస్‌ఎస్‌డీ టోకెన్లను టీటీడీ విడుదల చేసింది. అలాగే అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో నడిచి వచ్చే భక్తుల కోసం మరో 2 వేల టోకెన్లు కేటాయించింది. అయితే గంటలోపే టోకెన్ల కోటా పూర్తికావడంతో కేంద్రాల వద్ద వేచి ఉన్న అనేక మంది భక్తులకు టోకెన్లు లభించలేదు. టోకెన్లు అందని భక్తులు కేంద్రాల వద్ద ఆందోళన వ్యక్తం చేస్తూ, సుదూర ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలతో వచ్చిన తమకు సర్వదర్శన టోకెన్లు జారీ చేయకపోవడం సమంజసం కాదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

Next Story