జస్ట్ వన్ క్లిక్ చాలు.. కళ్లద్వారా డయాబెటిస్‌ను గుర్తిస్తున్న టెక్నాలజీ!

by Javid Pasha |

రక్త పరీక్షలు చేయకుండానే కళ్లను ఫొటో తీయడం ద్వారా మధుమేహం ఉందో లేదో తెలియజేసే సాంకేతిక వ్యవస్థను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

జస్ట్ వన్ క్లిక్ చాలు.. కళ్లద్వారా డయాబెటిస్‌ను గుర్తిస్తున్న టెక్నాలజీ!
X

దిశ, ఫీచర్స్ : మీ శరీరంలో మధుమేహం ప్రారంభమైందా? ఇది తెలుసుకోవడానికి డాక్టర్లు సహజంగానే రక్త పరీక్షలను సిఫార్సు చేస్తుంటారు. సంబంధిత రిపోర్టులు వచ్చాక వాటిని విశ్లేషించి ఫలితాలు వెల్లడిస్తుంటారు. కానీ ఆధునిక సాంకేతికత దీనిని మరింత సులభతరం చేస్తున్నది. రీసెంట్‌గా రక్త పరీక్షలు చేయకుండానే జస్ట్ మన కళ్లను ఫొటో తీయడం ద్వారా మధుమేహం ఉందో లేదో తెలియజేసే సాంకేతిక వ్యవస్థను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనినే EyeArt ఏఐ సిస్టమ్ అని పిలుస్తున్నారు. ఇంతకీ ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది? ఉపయోగాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఐఆర్ట్ (EyeArt) టెక్నాలజీ మానవ రెటినల్ ఫండస్ (కళ్ల వెనుక భాగం ఇమేజెస్) కెమెరాతో ఫోటోలను తీసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విశ్లేషించడం డయాబెటిక్ రెటినోపతి (DR)ని గుర్తిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మధుమేహం ద్వారా కళ్లలో సంభవించే మార్పులను విశ్లేషించడం ద్వారా ఇది సమస్యను 96-97% ఖచ్చితత్వంతో గుర్తిస్తుందని అంటున్నారు. అంటే బాధితుల నుంచి రక్తం సేకరించకుండానే డయాబెటిస్‌ ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. కొన్ని సెకన్లలోనే ఫలితాలు వస్తాయి. ఈ సాంకేతికత ఇప్పుడు FDA అనుమతి కూడా పొందింది. ఇప్పుడిప్పుడే ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. దీనిని ఉపయోగించుకోవడంవల్ల డయాబెటిస్ కారణంగా వచ్చే బ్లైండ్‌నెస్‌ను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ప్రయోజనాలు

* సూది లేకుండా, నొప్పి లేకుండా, ఒక్క చుక్క రక్తం కూడా సేకరించకుండానే డయాబెటిక్ స్క్రీనింగ్

*కొన్ని సెకన్లలో లేదా ఒక నిమిషం లోపలే ఫలితాలు తెలిసిపోతాయి.

*డయాబెటిస్ వల్ల కళ్లకు జరిగే హానిని (గుడ్డితనం వచ్చే ముందు) గుర్తించి సకాలంలో చికిత్స అందించవచ్చు.

*డాక్టర్ లేకుండానే టెక్నీషియన్ లేదా సెల్ఫ్-స్క్రీనింగ్ ద్వారా కూడా గుర్తించచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఉపయోగం.

*సాంప్రదాయ టెస్టుల కంటే సులభం, అలాగే ఖర్చు తగ్గుతుంది. సమయం ఆదా అవుతుంది.

*డయాబెటిస్ ఉన్నవారిలో క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేసి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story