మక్తల్‌ పై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి.. నాలుగోసారి పర్యటన వెనుక భారీ ప్రణాళిక

by Batti.Sumithra |

మక్తల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాలుగోసారి రావడం విశేషం.

మక్తల్‌ పై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి.. నాలుగోసారి పర్యటన వెనుక భారీ ప్రణాళిక
X

దిశ, మక్తల్ : మక్తల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాలుగోసారి రావడం విశేషం. అధికారికంగా రెండుసార్లు, అనధికారికంగా ఈరోజుతో కలిపి మరో రెండుసార్లు ఆయన మక్తల్‌ను సందర్శించారు. మక్తల్ నియోజకవర్గానికి నాలుగు సార్లు రావడం ద్వారా ఈ ప్రాంత పరిస్థితులను ఆయన దగ్గరగా పరిశీలించారు. కృష్ణా, భీమా అనే రెండు జీవనదులు ఉండి, సారవంతమైన భూములు, కష్టించి పనిచేసే మానవ వనరులు ఉన్నప్పటికీ అభివృద్ధిలో వెనుకబడిపోవడానికి గత పాలకుల నిర్లక్ష్యమే కారణమని గుర్తించారు. ఈ రెండు నదుల నీటిని సాగు, తాగునీటి అవసరాలకు సమర్థవంతంగా వినియోగిస్తే ఈ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని భావించిన రేవంత్ రెడ్డి, నారాయణపేట–మక్తల్–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా దాదాపు లక్షన్నర ఎకరాల భూమి సాగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సంగంబండ ఎత్తిపోతల పథకం ద్వారా లక్ష ఎకరాలకు పైగా సాగునీరు అందాల్సి ఉండగా, ఆయకట్టు చివరి ప్రాంతాలకు కాలువల నిర్మాణం పూర్తి కాకపోవడం, గత ప్రభుత్వాలు తగిన శ్రద్ధ చూపకపోవడం వల్ల భీమా ఎత్తిపోతల పథకం ప్రయోజనం సుమారు 70 వేల ఎకరాలకే పరిమితమైంది.

ఇదిలా ఉండగా, కృష్ణా, భీమా నదుల పై వరద నీటిని నియంత్రించేందుకు బ్యారేజీల నిర్మాణం చేపడితే అదనంగా మరో 50 వేల ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశముందని అధికారులు గుర్తించారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఈ రెండు నదులు ప్రవహిస్తున్నందున, బ్యారేజీల నిర్మాణం ద్వారా నీటిని సమర్థంగా వినియోగించుకునేందుకు ఇరు రాష్ట్రాల అధికారులు, పాలకులు ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సహాయ మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి సాయంత్రం ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వే ఫలితాలు కార్యరూపం దాల్చితే, నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం సస్యశ్యామలంగా మారి, పాడిపంటలతో కళకళలాడుతుందని, ఈ ప్రాంత ప్రజల వలసలు పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story