- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రామాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అవసరం.. ఎంపీడీఓ గంగాధర్
ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఆలూర్ మండలం మిర్దపల్లి గ్రామంలో ఎంపీడీఓ గంగాధర్, సర్పంచ్ యల్లా సాయిరెడ్డి ఆధ్వర్యంలో గురువారం గ్రామ సభ నిర్వహించారు.

దిశ, ఆలూర్ : ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఆలూర్ మండలం మిర్దపల్లి గ్రామంలో ఎంపీడీఓ గంగాధర్, సర్పంచ్ యల్లా సాయిరెడ్డి ఆధ్వర్యంలో గురువారం గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ గంగాధర్ మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ అమలులో బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఎల్‌ఏ) పాత్ర కీలకమని అన్నారు. రాజకీయ పార్టీలు వెంటనే బీఎల్‌ఏలను నియమించి నిర్దేశిత నమూనాలో జాబితాలను సమర్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రైతులకు ఎరువులు, విత్తనాల సరఫరా పై ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున పంటల మార్పిడి, నీటి పొదుపు, సమతుల్య ఎరువుల వినియోగం పై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.
గ్రామాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రతి ఇంటి నుంచి వచ్చే చెత్తను తడి, పొడి వ్యర్థాలుగా వేర్వేరుగా సేకరించి శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలని అన్నారు. తడి వ్యర్థాలతో సేంద్రీయ ఎరువుల తయారీ, పొడి వ్యర్థాల రీసైక్లింగ్ ద్వారా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచవచ్చని తెలిపారు. గ్రామాల్లో వేస్ట్ మేనేజ్‌మెంట్ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేసి చెత్త రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, పర్యావరణ పరిరక్షణ పై అవగాహన పెంచాలని సూచించారు. ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు.
సర్పంచ్ యల్లా సాయిరెడ్డి మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమని అన్నారు. గ్రామంలో పరిశుభ్రత, తాగునీటి సదుపాయాలు, మౌలిక వసతుల అభివృద్ధితో పాటు తడి, పొడి చెత్త వేర్వేరుగా ఇవ్వడం ప్రతి కుటుంబం బాధ్యతగా తీసుకోవాలని కోరారు. గ్రామాన్ని ఆదర్శవంతమైన, పరిశుభ్రమైన గ్రామంగా తీర్చిదిద్దేందుకు అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నవీన్, ఆర్ఐ అరవింద్, వార్డ్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, రైతులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.






