నా మనసంతా దానిపైనే ఉంది.. మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ వైరల్

by Chukka Sudharani |

రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమాపై మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించాడు.

నా మనసంతా దానిపైనే ఉంది.. మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ వైరల్
X

దిశ, సినిమా: గ్లోబల్ రామ్ చరణ్ నటించిన మోస్ట్ ఎవైటెడ్ చిత్రం ‘పెద్ది’ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సినిమా వీక్షించిన మెగా ఫ్యామిలీ తమ రివ్యూ ట్విట్టర్ వేదికగా తెలుపగా.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఓ పోస్ట్ షేర్ చేశారు. ‘నేను షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నా కూడా నా మనసంతా “పెద్ది” దగ్గరే ఉంది. గత రెండేళ్లగా ఈ సినిమా కోసం చరణ్ పడ్డ కష్టం, చూపించిన శ్రద్ధాశక్తులు అన్నీ దగ్గర నుంచి చూశాను. ఈ రోజు ప్రేక్షకుల ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే ఒక తండ్రిగా మాత్రమే కాదు, ఒక నటుడిగా కూడా ఎంతో గర్వంగా అనిపిస్తోంది. “పెద్ది” పాత్రలో పూర్తిగా లీనం కావడానికి తను అహర్నిశలు చేసిన కృషి, పట్టుదల, నిజాయితీ ప్రతి సన్నివేశంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ కష్టానికి దక్కిన ప్రతిఫలమే ఈ విజయం. ఇలాంటి అద్భుతమైన కథను రాసి, అంతే అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన దర్శకుడు బుచ్చిబాబు సానాకి నా ప్రత్యేక అభినందనలు. అలాగే తన తొలి చిత్రాన్నే ఇంత భారీ స్థాయిలో, ఎలాంటి రాజీ లేకుండా నిర్మించిన వెంకట సతీష్ కిలారుకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నటించిన నా మిత్రుడు, “కరునాడ చక్రవర్తి” శ్రీ శివన్న గారికి, అప్పలసూరి పాత్రలో అద్భుతంగా జీవించిన నా సోదర సమానుడు జగపతిబాబు గారికి అభినందనలు. అద్భుతమైన పాటలు, హృదయాన్ని కదిలించిన నేపథ్య సంగీతాన్ని అందించిన ఏఆర్ రెహమాన్ గారికి, ఈ చిత్రం విజయంలో భాగమైన జాన్వీ కపూర్, దివ్వేందు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, అలాగే వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలకు నా హృదయపూర్వక అభినందనలు. “పెద్ది” సాధించిన ఈ ఘన విజయం తెలుగు సినిమాకి గర్వంగా నిలవాలని, మరెన్నో మైలురాళ్లు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని తెలిపాడు.

Next Story