- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సారీ అమ్మా..నాన్న!.. మళ్లీ పరీక్షరాసే ధైర్యం లేదు : కలచి వేస్తోన్న సూసైడ్ నోట్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజీ వివాదం మరో విద్యార్థిని ఉసురు తీసింది. పరీక్ష రద్దు కావడంతో తీవ్ర మనోవేదనకు గురైన నీట్ అభ్యర్థిని ఆకాంక్ష చతుర్వేది.. ఆత్మహత్య చేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజీ వివాదం మరో విద్యార్థిని ఉసురు తీసింది. పరీక్ష రద్దు కావడంతో తీవ్ర మనోవేదనకు గురైన నీట్ అభ్యర్థిని ఆకాంక్ష చతుర్వేది.. ఆత్మహత్య చేసుకుంది. మధ్యప్రదేశ్ లోని మౌగంజ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. తనకు మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదని, అమ్మా, నాన్న తనను క్షమించాలని వేడుకుంటూ రాసిన సూసైడ్ నోట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అందరినీ కలచివేస్తోంది. "అమ్మా, నాన్న.. మీ కూతురు బాగా చదివి డాక్టర్ అవుతుందని మీరు నమ్మారు. కానీ నాకు మళ్లీ నీట్ పరీక్ష రాసే ధైర్యం లేదు. నేను మిమ్మల్నిద్దరినీ నాశనం చేశాను. మళ్లీ పరీక్ష రాసినా నేను బాగా రాస్తాననే గ్యారెంటీ లేదు" అని ఆమె ఆ నోట్‌లో పేర్కొంది.
ఈ ఏడాది మే 3వ తేదీన జరిగిన నీట్ యూజీ -2026 టెస్ట్ కు ఆకాంక్ష హాజరైంది. మే 12న పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షను రద్దు చేసి.. జూన్ 21న రీ టెస్ట్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. కాగా.. నీట్ టెస్ట్ రాసిన ఆకాంక్ష తనకు 650 మార్కులు వస్తాయని ఎంతో నమ్మకంగా ఎదురుచూస్తున్న క్రమంలో పరీక్ష రద్దుకావడంతో తట్టుకోలేకపోయింది. రీ టెస్ట్ తాను రాయలేనని తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందని, ఆ డిప్రెషన్ తోనే ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆకాంక్షను డాక్టర్‌గా చూడాలనే కల కోసం ఆ నిరుపేద కుటుంబం ఎన్నో ఆర్థిక త్యాగాలు చేసింది. తమ సేవింగ్స్ తో పాటు.. నాగపూర్ లో కోచింగ్ ఇప్పించేందుకు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రూ.3 లక్షలు అప్పు చేశారు. తండ్రి కృష్ణకుమార్ చతుర్వేది వ్యవసాయం చేస్తుంటారు. ఆకాంక్ష కోచింగ్ సమయంలో ఆమెతోపాటే ఉండి.. ఓ హోటల్ లో కుక్ గా పనిచేశారు. ఈ ఏడాది మెడికల్ సీటు వస్తుందని, తమ కూతురు నాలుగేళ్లలో డాక్టర్ అవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న వేళ వారి ఆశలన్నీ అడియాశలయ్యాయి. జార్ఖండ్‌కు చెందిన 16 ఏళ్ల మరో నీట్ అభ్యర్థిని కూడా ఈ వివాదం కారణంగా తీవ్ర డిప్రెషన్‌కు లోనై ఆత్మహత్యకు పాల్పడింది. టెన్త్ క్లాస్ పూర్తి కాగానే ఢిల్లీలో కోచింగ్ తీసుకుని, పరీక్ష రాసి ఇంటికి తిరిగొచ్చిన ఆమె.. ఈ గందరగోళాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచింది.






