చెవులు పగిలే శబ్దాలకు చెక్

by Ratna Kumari |

బుల్లెట్ బైక్‌లకు మోడిఫైడ్ సైలెన్సర్లు అమర్చి అధిక శబ్దాలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వాహనదారులపై కోదాడ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు.

చెవులు పగిలే శబ్దాలకు చెక్
X

దిశ, కోదాడ : బుల్లెట్ బైక్‌లకు మోడిఫైడ్ సైలెన్సర్లు అమర్చి అధిక శబ్దాలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వాహనదారులపై కోదాడ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. మంగళవారం పట్టణంలోని రంగా థియేటర్ చౌరస్తాలో జిల్లా ఎస్పీ నరసింహ ఆధ్వర్యంలో స్వాధీనం చేసుకున్న 41 మోడిఫైడ్ బుల్లెట్ సైలెన్సర్లను భారీ రోడ్ రోలర్‌తో ధ్వంసం చేశారు. రోడ్డు మధ్యలో వరుసగా పేర్చిన సైలెన్సర్లపై రోడ్ రోలర్ నడిపించి నుజ్జునుజ్జు చేయడంతో ఆ దృశ్యం స్థానికులను ఆకట్టుకుంది. కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. పోలీసు అధికారులు, సిబ్బంది సమక్షంలో జరిగిన ఈ చర్య చర్చనీయాంశంగా మారింది.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా మోడిఫైడ్ సైలెన్సర్లు అమర్చడం చట్టవిరుద్ధమని, వాటి వల్ల శబ్ద కాలుష్యం పెరగడమే కాకుండా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి, భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని స్పష్టం చేశారు. ఇకపై ప్రత్యేక డ్రైవ్‌లను మరింత విస్తృతంగా నిర్వహించి, మోడిఫైడ్ సైలెన్సర్లు అమర్చిన వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకోవడంతో పాటు జరిమానాలు విధించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. "సరదా కోసం సైలెన్సర్ మార్చితే... చివరకు రోడ్ రోలర్ కిందే అంతం" అంటూ వాహనదారులకు పోలీసులు గట్టి హెచ్చరిక జారీ చేశారు. కోదాడ పోలీసులు చేపట్టిన ఈ చర్యపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ, రాత్రివేళల్లో అధిక శబ్దాలతో ఇబ్బందులు కలిగిస్తున్న వాహనాలపై ఇలాంటి చర్యలు నిరంతరం కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, పట్టణ సీఐ శివశంకర్, ట్రాఫిక్ ఎస్ఐ బైరెడ్డి అంజిరెడ్డి, పట్టణ ఎస్ఐలు అజయ్ కుమార్, ఉపేందర్ రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Next Story