- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాతృ భాషల పరిరక్షణ అందరి బాధ్యత : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
మాతృభాషల పరిరక్షణ అందరి బాధ్యత అని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. గోండి మాతృభాషా దినోత్సవ వేడుకలను మంగళవారం ఉట్నూర్ లోని కేబీ కాంప్లెక్స్ ఘనంగా నిర్వహించారు.

దిశ, ఉట్నూర్ : మాతృభాషల పరిరక్షణ అందరి బాధ్యత అని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. గోండి మాతృభాషా దినోత్సవ వేడుకలను మంగళవారం ఉట్నూర్ లోని కేబీ కాంప్లెక్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఐటీడీఏ పీవో మందమకరందు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ గోండి, కొలాం వంటి ఆదివాసీ మాతృభాషలు కేవలం సంభాషణకు మాత్రమే పరిమితం కాకుండా గిరిజనుల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానానికి ప్రతీకలని పేర్కొన్నారు. గిరిజన సమాజం తమ సంస్కృతి, ఆచార వ్యవహారాలను ఇప్పటివరకు పరిరక్షిస్తూ వస్తున్నందువల్లే ఈ భాషలు జీవించి ఉన్నాయని కొనియాడారు. పీవో మకరందు ఆధ్వర్యంలో ఐఐటీ విద్యార్థుల సహకారంతో కృత్రిమ మేధస్సు (ఏఐ) సాంకేతికతను వినియోగించి గోండి, కొలాం భాషలను ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ అర్థమయ్యే విధంగా రూపొందిస్తున్న ప్రయత్నం ఎంతో అభినందనీయమని అన్నారు. ఇది భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడే వినూత్న కార్యక్రమమని పేర్కొన్నారు.
నేటి యువత తమ మాతృభాషలను, సంస్కృతి, సంప్రదాయాలను మరువకూడదని, ప్రతి కుటుంబంలో పిల్లలకు మాతృభాషను నేర్పించే బాధ్యత పెద్దలపై ఉందని సూచించారు. గోండి, కొలాం భాషల అభివృద్ధికి అవసరమైన నిధులు ఏవైనా ఉంటే సంబంధిత మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్లి విడుదల చేయించేందుకు తాను పూర్తిస్థాయిలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు సంప్రదాయ ఆదివాసీ దోతీలు ధరించి విచ్చేసిన ఆదివాసీ పెద్దలు, గ్రామ పటేళ్లు, సంఘ నాయకులు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గిరిజన మహిళలు, విద్యార్థినులు సంప్రదాయ నృత్యాలు, ఆటపాటలతో ఆదివాసీ సంస్కృతి వైభవాన్ని ప్రతిబింబిస్తూ అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చి అందరినీ అలరించారు. ఈ కార్యక్రమం అనంతరం గోండి–కొలామి పొడుపు కథల పుస్తకాన్ని ఎమ్మెల్యే, పీవో సంయుక్తంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రచయితలను, భాషా పరిరక్షణ కోసం కృషి చేస్తున్న ఆదివాసీ మేధావులను అభినందించారు. ఈ కార్యక్రమంలో డీడీ ప్రేమకళ, ఏపీఓ (పీవీటీజీ) ఆత్రం భాస్కర్, డిప్యూటీ ఈఈ చందన్, ఈఈ తానాజీ, డీఎంజీసీ సందీప్ కుమార్, అడిషనల్ డీఎంహెచ్‌వో డా. కుడిమెత మనోహర్, ఐటీడీఏ అధికారులు, సిబ్బంది, ఆదివాసీ సార్ మేడిలు, గ్రామ పటేళ్లు, సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులు, గిరిజన మహిళలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఆదివాసీలు పాల్గొన్నారు.






