- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంతర్‌రాష్ట్ర నకిలీ పత్తి విత్తనాల ముఠా గుట్టురట్టు
రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట్ గ్రామంలో ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్‌బీనగర్ ఎస్‌ఓటీ బృందం, అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు, వ్యవసాయ అధికారులు మెరుపు దాడి నిర్వహించారు.

దిశ, అబ్దుల్లాపూర్ మెట్ : రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట్ గ్రామంలో ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్‌బీనగర్ ఎస్‌ఓటీ బృందం, అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు, వ్యవసాయ అధికారులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణలోని పత్తి రైతులు వినియోగించేందుకు నకిలీ బీటీ పత్తి విత్తనాలను అక్రమంగా తరలిస్తున్న ఆరుగురు నిందితులను అరెస్టు చేసి, 400 కేజీల నకిలీ బీటీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పిడుగురాళ్ల ప్రాంతం నుంచి నకిలీ విత్తనాలను సేకరించి, అధిక దిగుబడి వస్తుందని రైతులను మాయమాటలకు గురిచేసి, కిలోకు సుమారు రూ.2,500 చొప్పున విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడైంది. నిందితుల నుంచి అక్రమ రవాణాకు వినియోగిస్తున్న రెండు కార్లు, 13 గోనె సంచుల్లో ఉన్న నకిలీ విత్తనాలు, ఆరు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుల్లో ఇద్దరు గతంలో కూడా నకిలీ విత్తనాల కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు గుర్తించారు. ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న సరఫరా వ్యవస్థలోని ఇతర వ్యక్తులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. నకిలీ విత్తనాల వల్ల రైతులు తీవ్ర ఆర్థిక నష్టాలకు గురవుతారని, ఇలాంటి నకిలీ విత్తనాల కేంద్రాలను అక్రమంగా నిర్వహించే వారిపై భారత న్యాయ సంహిత, పర్యావరణ పరిరక్షణ చట్టం–1986, విత్తనాల చట్టం–1966, విత్తనాల నియంత్రణ ఉత్తర్వులు–1983లోని సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి నకిలీ విత్తనాల వ్యాపారాలకు పాల్పడుతున్న వ్యక్తుల గురించి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ ఐపీఎస్ బి. సుమతి, డీసీపీ (ఎల్‌బీనగర్ జోన్) డాక్టర్ బి. అనురాధ, ఎస్‌ఓటీ బృందం, అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు, వ్యవసాయ అధికారులు పాల్గొని విజయవంతంగా అక్రమార్కులపై మెరుపు దాడి నిర్వహించారు.






