Farmers March: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా రైతుల ఆందోళన

by S Gopi |

కిసాన్ మహాపంచాయత్‌కు బయలుదేరిన వందలాది మంది పంజాబ్ రైతులను శంభు సరిహద్దు వద్ద పోలీసులు అడ్డుకున్నారు.

Farmers March: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా రైతుల ఆందోళన
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ వైపు నిరసనగా బయలుదేరిన రైతులకు హర్యానా సరిహద్దుల్లో మళ్ళీ ఆంక్షల అడ్డంకులు ఎదురయ్యాయి. అమెరికాతో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని నిరసిస్తూ ‘దేశ్ బచావో మోర్చా’ పిలుపునిచ్చిన కిసాన్ మహాపంచాయత్‌కు బయలుదేరిన వందలాది మంది పంజాబ్ రైతులను శంభు సరిహద్దు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. గతంలో 2024 'ఢిల్లీ చలో-2' నిరసనలను గుర్తుకుతెచ్చేలా సరిహద్దులో కాంక్రీట్ దిమ్మెలు, ఇనుప మేకులతో బారికేడ్లు ఏర్పాటు చేశారు. తమ ప్రజాస్వామ్య హక్కును అణచివేస్తున్నారని ఆరోపిస్తూ రైతులు సరిహద్దులోనే ధర్నాకు దిగారు. అయితే, ముందస్తుగా అరెస్టు చేసిన రైతు నాయకులందరినీ విడుదల చేయడానికి, కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో చర్చలు ఏర్పాటు చేయడానికి హర్యానా ప్రభుత్వం హామీ ఇవ్వడంతో మధ్యాహ్నానికి నిరసనకారులు తాత్కాలికంగా వెనక్కి తగ్గారు.

భారత్-అమెరికా సంయుక్త ప్రకటన ప్రకారం 2026 ఆఖరు నాటికి మొదటి విడత ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకాలు జరగాల్సి ఉండగా, దీన్ని రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అమెరికా నుంచి వచ్చే సబ్సిడీ సోయాబీన్, మొక్కజొన్న, పత్తి, బాదం, పాల ఉత్పత్తులకు తక్కువ పన్నులతో భారత మార్కెట్లను తెరిస్తే, దేశంలోని కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులు నిలదొక్కుకోలేరని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 8 కోట్ల గ్రామీణ కుటుంబాలు ఆధారపడిన భారతీయ పాడి రంగం ఈ ఒప్పందంతో తీవ్రంగా దెబ్బతింటుందని రైతు నాయకులు హెచ్చరిస్తున్నారు. ఒప్పందపు వివరాలను రహస్యంగా ఉంచకుండా ప్రజల ముందుంచాలని, వాటాదారులతో మాట్లాడకుండా ఏ సంతకాలు చేయవద్దని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ తమ అభ్యంతరాలను పక్కనబెట్టి డీల్ దిశగా ముందడుగు వేస్తే నిరసనను దేశవ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు.

Next Story