హవేలీ ఘనపూర్ రైతుల ఏకగ్రీవ తీర్మానం

by Batti.Sumithra |

తెలంగాణ రైతు రక్షణ సమితి ఆధ్వర్యంలో హవేలీ ఘనపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ రైతులతో గురువారం సమావేశం నిర్వహించారు.

హవేలీ ఘనపూర్ రైతుల ఏకగ్రీవ తీర్మానం
X

దిశ, మెదక్ టౌన్ : తెలంగాణ రైతు రక్షణ సమితి ఆధ్వర్యంలో హవేలీ ఘనపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ రైతులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంక్షేమానికి సంబంధించిన అంశాలపై చర్చించి, పలు కీలక డిమాండ్లతో ఏకగ్రీవ తీర్మానం చేశారు. రైతు సంక్షేమం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత అని పేర్కొంటూ, రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు రెండు ప్రభుత్వాలు కలిసి పని చేయాలని వారు కోరారు. అనంతరం రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీహరి రావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నప్పటికీ గ్రామీణ రైతుల ఆర్థిక పరిస్థితిలో ఆశించిన మార్పు కనిపించడం లేదన్నారు. రైతుల సమస్యల పై పరస్పరం విమర్శలు చేసుకోవడం వల్ల ప్రయోజనం లేదని, సమస్యల పరిష్కారానికి సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు.

రైతులు తమ ప్రధాన డిమాండ్లుగా ఎరువుల పెరిగిన ధరలను తగ్గించడం, అన్ని పంటలకు ప్రస్తుత సాగు ఖర్చులకు అనుగుణంగా కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ని రెట్టింపు చేయడం, ఎంఎస్‌పీకి చట్టబద్ధ హామీ కల్పించడం, రైతు అనుకూల పంటల బీమా పథకాన్ని అమలు చేయడం వంటి అంశాలను ప్రస్తావించారని తెలిపారు. అధిక వడ్డీతో ఉన్న ప్రైవేట్ అప్పుల భారం నుంచి రైతులను బయటపడేసేందుకు ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం అదనపు రుణ సౌకర్యాలను బ్యాంకుల ద్వారా అందించాలని కోరారు. వ్యవసాయ కూలీల కొరత, పెరుగుతున్న వ్యయాలను తగ్గించేందుకు రైతు వాటా 50 శాతంతో వ్యవసాయ పనులను ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ధాన్యం, ఇతర పంటల కొనుగోలు ప్రక్రియను సరళీకరించి, రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి వేచి ఉండే పరిస్థితి లేకుండా ముందస్తు ప్రణాళికతో కొనుగోళ్లు నిర్వహించాలని తీర్మానంలో పేర్కొన్నారు. డీజిల్, విద్యుత్, విత్తనాలు, ఎరువులు, కూలీ ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో రైతుల ఆదాయం పెరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల పిల్లలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశ్యంతో, జనాభా ప్రాతిపదికన 2025 వరకు ముద్ర రుణాల పంపిణీలో జాతీయ సగటును చేరుకోవడంలో తెలంగాణ రాష్ట్రం 71 లక్షల ముద్ర రుణాల మేర వెనుకబడి ఉందని పేర్కొన్నారు. దీంతో తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు. రాష్ట్రంలోని బ్యాంకులకు అదనపు లక్ష్యాలను కేటాయించేలా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ తీర్మానాన్ని హవేలీ ఘనపూర్ గ్రామ రైతులు ఏకగ్రీవంగా ఆమోదించి, రైతు సంక్షేమానికి సంబంధించిన అంశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

Next Story