3D ప్రింటింగ్‌తో కృత్రిమ శ్వాసనాళం.. వైద్య రంగంలో మరో అద్భుతం!

by Javid Pasha |

త్రీడీ ప్రింటింగ్ శ్వాసనాళ పద్ధతి వల్ల సాధారణ అవయవ మార్పిడుల్లో వాడే ఇమ్యూన్ సప్రెసెంట్ మెడికేషన్స్ అవసరం తగ్గుతుంది.

3D ప్రింటింగ్‌తో కృత్రిమ శ్వాసనాళం.. వైద్య రంగంలో మరో అద్భుతం!
X

దిశ, ఫీచర్స్ : వైద్య రంగంలో మరో మైలురాయి సాధించారు శాస్త్రవేత్తలు. సాధారణంగా థైరాయిడ్ క్యాన్సర్ సర్జరీ.. లేదా పలు ఇతర కారణాలవల్ల బాధితుల్లో శ్వాసనాళం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు రోగికి సెట్ అయ్యే డోనర్ అవయవం లభించడం చాలా కష్టం. లభించినా కొన్నిసార్లు ట్రీట్మెంట్ సక్సెస్ కాకవపోచ్చు. అయితే దీనికి చక్కటి పరిష్కారాన్ని కనుగొన్నారు కాథలిక్ యూనివర్సిటీ ఆఫ్ కొరియా శాస్త్రవేత్తలు. రోగి సొంత కణాలతో త్రీడీ ప్రింటింగ్ ద్వారా ఒక కృత్రిమ శ్వాసనాళం తయారు చేసి, విజయవంతంగా అతని శరీరంలో అమర్చారు. ఇది పునరుత్పాదక వైద్య రంగంలో పెద్ద ముందడుగు అంటున్నారు.

ఎలా చేశారు?

కృత్రిమ శ్వాసనాళం తయారీలో భాగంగా శాస్త్రవేత్తలు ముందుగా రోగి శరీర నిర్మాణానికి అనుగుణంగా బయోడీగ్రేడబుల్ స్కాఫోల్డ్‌తో శ్వాసనాళాన్ని నిర్మించారు. ఆ స్కాఫోల్డ్‌పై రోగి మూలకాణాలను నాటారు. కాలక్రమేణా ఆ సెల్స్ పెరిగి జీవ కణజాలంగా మారాయి. ఇక్కడ స్కాఫోల్డ్ నెమ్మదిగా కరిగిపోయి, చివరికి పూర్తి సహజమైన శ్వాసనాళం మిగిలిపోయింది. ఇలా డోనర్ అవయవాలపై ఆధారపడకుండా సొంత శరీరంతోనే దెబ్బతిన్న శ్వాసనాళాలను రిపేర్ చేయవచ్చు. రోగి సొంత కణాలను ఉపయోగించడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ ఆమోదం సమస్య కూడా రాదు. కాబట్టి ఇమ్యూన్ రిజెక్షన్ భయం లేకుండా కూడా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వైద్య రంగంలో మరో మార్పు

ఈ త్రీడీ ప్రింటింగ్ శ్వాసనాళ పద్ధతి వల్ల సాధారణ అవయవ మార్పిడుల్లో వాడే ఇమ్యూన్ సప్రెసెంట్ మెడికేషన్స్ లేకపోవడం మరో ప్రధాన ప్రయోజనంగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. పైగా వీటివల్ల వచ్చే ఇన్ఫెక్షన్, ఇతర సమస్యలు తగ్గుతాయి. ఈ ఆవిష్కరణ భవిష్యత్తులో రక్త నాళాలు, కార్టిలేజ్, ఇతర అవయవాల తయారీకి కూడా దారితీయచ్చునని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇంకా పెద్దస్థాయి అధ్యయనాలు, క్లినికల్ ట్రయల్స్ కూడా అవసరమని చెబుతున్నారు. అక్కడ కూడా సక్సెస్ అయితే వైద్య రంగంలో పలు ఇతర చికిత్సలలో కూడా సమర్థవంతమైన మార్పులు వస్తాయని పేర్కొంటున్నారు.

ప్రయోజనాలు

*కృత్రిమ శ్వాసనాళంలో ఉండేవి రోగి సొంత కణాలు కాబట్టి ఇమ్యూన్ రిజెక్షన్ దాదాపు ఉండదు.

*ఇమ్యూన్ సప్రెసెంట్ మందులు (లాంగ్-టర్మ్) అవసరం లేదు. ఇన్ఫెక్షన్, క్యాన్సర్, ఇతర సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి.

*డోనర్ అవయవాల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు.

*రోగి శరీరానికి పూర్తిగా సరిపోయేలా డిజైన్ చేయవచ్చు.

*భవిష్యత్తులో రక్తనాళాలు, కార్టిలేట్ వంటి ఇతర అవయవాల తయారీకి మార్గం సుగమం చేస్తుంది.

Next Story