పార్లమెంట్ మార్చ్ సక్సెస్ చేయండి.. ఆస్పత్రి నుంచి సోనమ్ వాంగ్చుక్ పిలుపు

by I. Sairam |

సోమవారం చేపట్టబోయే పార్లమెంట్ మార్చ్ కు తరలిరావాలని సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ పిలుపునిచ్చారు.

పార్లమెంట్ మార్చ్ సక్సెస్ చేయండి..  ఆస్పత్రి నుంచి సోనమ్ వాంగ్చుక్ పిలుపు
X

దిశ, నేషనల్ బ్యూరో : నీట్ పేపర్ లీకేజీ, ఇతర పరీక్షల్లో జరిగిన అవకతవకలను నిరసిస్తూ సోమవారం నిర్వహించ తలపెట్టిన పార్లమెంట్ మార్చ్‌ను విజయవంతం చేయాలని సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ పిలుపునిచ్చారు. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నఆయన అక్కడి నుంచే చేతితో రాసిన ఓ లేఖను విడుదల చేశారు. తనను బలవంతంగా ఆస్పత్రికి తరలించడాన్ని అక్రమ నిర్బంధం అని పేర్కొన్నారు. ఈ నిరసనను భారతదేశ రెండో స్వాతంత్య్ర ఉద్యమంగా అభిర్ణయించారు. పేపర్ లీక్‌ల వంటి అన్యాయాల నుండి, అలాగే తనను ఉంచిన అక్రమ నిర్బంధం వంటి భయం నుండి విముక్తి కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ లేఖను తన భార్య గీతాంజలి జె ఆంగ్మో ద్వారా బయటకు పంపుతున్నానని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వ చర్య సరైనదే : ఢిల్లీ హైకోర్టు

సోనమ్ వాంగ్చుక్‌ను సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి నుంచి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలంటూ ఆయన భార్య గీతాంజలి ఆంగ్మో దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు ఆదివారం తిరస్కరించింది. ఈ విషయంలో కోర్టు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. వాంగ్చుక్‌ శారీరక స్వయంప్రతిపత్తి హక్కులకు ఎలాంటి భంగమూ కలగలేదని, ఆయన ఆరోగ్యం వేగంగా క్షీణిస్తున్నందునే ప్రభుత్వం ఈ చర్య తీసుకుందని, ఇందులో ఎలాంటి ఏకపక్ష వైఖరి లేదని జస్టిస్ మిని పుష్కర్ణతో కూడిన ఏకసభ్య బెంచ్ స్పష్టం చేసింది. ఆరోగ్యం క్షీణిస్తున్నా ఆయన ఆస్పత్రిలో చేరడానికి నిరాకరించారని, అందువల్ల ప్రజా ఆరోగ్యం దృష్ట్యా జోక్యం చేసుకునే పూర్తి హక్కు ప్రభుత్వానికి ఉందని బెంచ్ పేర్కొంది. ప్రతీ ప్రాణం ఎంతో విలువైందని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్‌పై‌ కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీస్, సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే వాంగ్చుక్‌ను కలుసుకునేందుకు ఆయన భార్యకు, కుటుంబ సభ్యులకు 24 గంటల పాటు పూర్తి అనుమతి ఇవ్వాలని అధికారులను ఆదేశిస్తూ.. తదుపరి విచారణను జూలై 24‌కి వాయిదా వేసింది.

ప్రభుత్వ జోక్యం అవసరమే లేదు : గీతాంజలి ఆంగ్మో

కోర్టు ఆదేశాలపై గీతాంజలి ఆంగ్మో అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తప్పుగా అర్థం చేసుకుందని ఆవేదన వ్యక్తం చేవారు. వాంగ్చుక్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఇందులో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరమే లేదని స్పష్టం చేశారు. ఆయన గతంలో లడఖ్‌లో 35 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారని, ఢిల్లీలో దీక్ష 22వ రోజేనని గుర్తు చేశారు. కోర్టు తీర్పుపై సోమవారం తాము ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. జంతర్ మంతర్ వద్ద వాంగ్చుక్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతాయనే భయంతోనే ప్రభుత్వం ఆయనను ఆస్పత్రికి తరలించిందని ఆరోపించారు. పార్లమెంట్ మార్చ్‌లో ప్రజలందరూ పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు. శాంతియుతంగా నిరసన తెలియజేయాలని, అలాగే ఈ నిరసనకు వేరే రంగు పులిమేందుకు ప్రయత్నించే అసాంఘిక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు.

చలో సంసద్‌కు నో పర్మిషన్

నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో చలో సంసద్‌ (పార్లమెంట్ మార్చ్)కు తరలిరావాలని ఓ వైపు వాంగ్చుక్, కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునివ్వగా.. అసలు ఈ కార్యక్రమానికి ఎవరూ అనుమతి కోరలేదని, తాము కూడా అనుమతి ఇవ్వలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. ఢిల్లీ జిల్లా పరిధిలో బీఎన్ఎస్ఎస్‌లోని సెక్షన్ 163 (సెక్షన్ 144) అమల్లో ఉందని ఉంటుందని, ఈ ఆంక్షలను ధిక్కరించి ఎవరైనా పార్లమెంట్ వైపు దూసుకురావడానికి ప్రయత్నిస్తే, వారిని అరెస్ట్ చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. వాంగ్చుక్‌ను ఆస్పత్రికి తరలించిన తర్వాత సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే జంతర్ మంతర్ చేపట్టిన నిరాహార దీక్ష ఆదివారంతో రెండో రోజుకు చేరుకుంది. సోమవారం నాటి మార్చ్ కోసం తాను శక్తినంతా కూడగట్టుకుంటున్నానని ఈ సందర్బంగా దీప్కే పేర్కొన్నారు.

సోనమ్ వాంగ్చుక్ హెల్త్ బులిటెన్ విడుదల

సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి వాంగ్చుక్ హెల్త్ బులిటెన్‌ను ఆదివారం సాయంత్రం విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన స్పృహలోనే ఉన్నారని, ఆరోగ్యం నిలకడగా ఉందని, బీపీ, పల్స్ రేటు, ఆక్సిజన్ స్థాయిలు సాధారణ పరిమితుల్లోనే ఉన్నాయని బులిటెన్ పేర్కొంది. సుదీర్ఘ ఉపవాసం వల్ల రక్త పరీక్షల పారామీటర్లలో స్వల్ప మార్పులు కనిపించాయని తెలిపింది. కాగా.. డాక్టర్లు ఐవీ ఫ్లూయిడ్స్, ఎలక్ట్రోలైట్స్, ఇతర అత్యవసర మందులు తీసుకోవాలని సూచించినప్పటికీ, వాంగ్చుక్ వాటన్నింటినీ నిరాకరిస్తున్నారని, కేవలం నోటి ద్వారా ఉప్పు నీరు, కొన్ని ద్రవాలను మాత్రమే తీసుకుంటున్నారని తెలుస్తోంది.

Next Story