- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుమారులు ఇద్దరూ మా బాగోగులు చూసుకోవడం లేదు
వృద్ధాప్యంలో ఉన్న మా బాగోగులు చూసుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న మా ఇద్దరు కుమారులపై మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్–2007 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరుతూ వృద్ధ దంపతులు ప్రజావాణిలో అర్జీ అందజేశారు.

దిశ, సిద్దిపేట ప్రతినిధి : వృద్ధాప్యంలో ఉన్న మా బాగోగులు చూసుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న మా ఇద్దరు కుమారులపై మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్–2007 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరుతూ వృద్ధ దంపతులు ప్రజావాణిలో అర్జీ అందజేశారు. వృద్ధ దంపతులు ప్రజావాణిలో అందజేసిన అర్జీలోని వివరాల ప్రకారం హుస్నాబాద్ మండలం నాగారం గ్రామానికి చెందిన గడ్డి మల్లయ్య, గడ్డి వెంకటవ్వలకు గడ్డి సమ్మయ్య, గడ్డి అయిలయ్య అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. గడ్డి మల్లయ్యకు కుడి కాలు తొలగించబడింది. గడ్డి వెంకటవ్వకు కళ్లుచూపు లేదు. కష్టార్జితంగా సంపాదించిన వ్యవసాయ భూమి, ఇంటి అడుగు జాగను ఇద్దరు కుమారులకు సమాన భాగాలుగా పంచి ఇచ్చారు. ప్రస్తుతం కుమారులు ఇద్దరూ వృద్ధ దంపతుల బాగోగులు చూసుకోవడం లేదని వారు వాపోయారు.
ఈ విషయమై 2026 మే 17న హుస్నాబాద్ ఆర్డీవోకు దరఖాస్తు ఇవ్వగా, తమ బాగోగులు చూసుకోవాలని ఆర్డీవో ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. అనంతరం పెద్దమనుషుల సమక్షంలో తమ బాగోగులు చూసుకుంటామని ఇద్దరు కుమారులు ఒప్పంద పత్రం కూడా రాసి ఇచ్చినట్లు పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రస్తుతం తమ కుమారులు తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధాప్యం కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నామని, ఆసుపత్రి ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వడం లేదని, కనీసం ఒక పూట భోజనం కూడా పెట్టడం లేదని తెలిపారు. పెద్దమనుషులు చెప్పినా వినిపించుకోకుండా నానా దుర్భాషలతో దూషిస్తున్నారని వృద్ధ దంపతులు వాపోయారు. కావున తమ పై కనికరం చూపి, తమ బాగోగులు చూసుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న ఇద్దరు కుమారులపై మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్–2007 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తమ నుంచి పొందిన వ్యవసాయ భూమిని, ఇంటి అడుగు స్థలాన్ని తిరిగి తమ పేరిట మార్చి న్యాయం చేయాలని వృద్ధ దంపతులు కోరుతున్నారు.






